ఘనంగా హనుమద్ హోమం
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం హనుమద్ హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా హోమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ సహాయ కమిషనరు ఆర్‌వీ చందన పర్యవేక్షించారు. స్వామిని కొవ్వూరు 9వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎం.అనురాధ కుటుంబ సమేతంగా ఆదివారం రాత్రి దర్శించుకున్నారు.
కొయ్యలగూడెం: విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందిన ఘటన కన్నాపురంలో ఆదివారం జరిగింది. దళితవాడలో ఉంటున్న యువకుడు సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లి ఎలక్ట్రికల్ రిపేరు చేస్తుండగా విద్యుత్ షాక్‌కి గురై అక్కడే మృతి చెందాడు. యువకుడు ఇంటర్ చదువుతున్నట్లు తెలిసింది
భీమవరం: భీమవరం ఒకటో పట్టణంలోని బేతనీపేటకు చెందిన యువతి విద్యుత్తు హీటర్ రాడ్ తగిలి షాక్‌తో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్.డి.లావణ్య(19) నవంబరు 29న స్నానం చేసి వస్తానని పై అంతస్తులో ఉన్న తండ్రికి చెప్పి కిందకు వచ్చింది. నీటిని వేడి చేసేందుకు హీటరు పెట్టింది. రాత్రి 10 గంటల వరకు ఆమె ఆచూకీ లేకపోవడంతో తండ్రి కిందికి వచ్చి చూసేసరికి కిందపడి ఉన్నట్టు గుర్తించారు. అల్లుడికి సమాచారం ఇవ్వగా అతడు వచ్చాక ఇంట్లోకి తీసుకెళ్లి పరిశీలిస్తే అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై బి.వై.కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


