
ప్రజాదర్బార్‌కు స్పందన కరువు
బొండపల్లి: బొండపల్లి మండల కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తొలిసారిగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాదర్బార్‌కు స్పందన కరువైంది. తొలుత ఉదయం 9 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ప్రకటించి సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేశారు. మండల కేంద్రంలోని రాజులు సావిడి వద్ద 4.30 గంటలకు దర్బార్‌ను నిర్వహించడంతో మంత్రికి వినతులు ఇచ్చేందుకు జనం ఆసక్తి చూపలేదు. కొందరు రెవెన్యూ పరమైన సమస్యలపై వినతులు అందజేశారు. గంటన్నర సేపు మంత్రి అర్జీలును స్వీకరించి వెళ్లి పోయారు. కార్యక్రమంలో తహసీల్దార్ డోలా రాజేశ్వరరావు, సర్పంచ్ బొండపల్లి ఈశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.