
పర్యాటకంగా భోగాపురం అభివృద్ధికి చర్యలు
భోగాపురం: పర్యాటకంగా భోగాపురాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ అన్నారు. మండలంలో ఆయన శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. రెడ్డి కంచేరు వద్ద ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న బీచ్ రిసార్ట్స్‌ను, కవులవాడలో కన్వెన్షన్ నిర్మాణ పనులను పరిశీలించారు. సంబంధిత సంస్థల ప్రతినిధులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలెక్టర్ అంబేడ్కర్‌తో కలిసి పరిశీలించారు. నిర్ణీత గడువుకంటే ముందుగానే ఎయిర్‌ఫోర్టు నిర్మాణం పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయని జీఎంఅర్ గ్రూప్ సీఈఓ మన్మోయ్‌రాయ్ వివరించారు. అనంతరం అజయ్‌జైన్ మాట్లాడుతూ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతున్న తరుణంలో పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి హోటళ్ల నిర్మాణం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, విమానాశ్రయ సిబ్బంది పాల్గొన్నారు.