
లింగ నిర్ధారణ పరీక్షలు నేరం : డీఎంహెచ్‌వో
పార్వతీపురం టౌన్: జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి వివరాలు వెల్లడించడం చట్టరీత్యా నేరమని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.భాస్కరరావు అన్నారు. అటువంటి స్కానింగ్ సెంటర్లపై, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా సెంటర్ల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. గర్భస్థ శిశు స్థితిగతులు, సమస్యలు తెలుసుకునేందుకే స్కానింగులు చేయాలే తప్ప, వీటిని ఆసరాగా తీసుకుని గర్భస్థ శిశు వివరాలు వెల్లడించడం నేరమన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లా స్థాయి సలహా మండలి సమావేశం డీఎంహెచ్‌వో అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 44 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ప్రతి స్కానింగ్ సెంటరులో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంతో పాటు ఆయా కేంద్రాలపై ప్రోగ్రాం అధికారుల ద్వారా ఎప్పటికపుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇకపై ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే అబార్షన్ల వివరాలతో పాటు అందుకు తగిన కారణాలను తమకు సమర్పించాలని స్పష్టం చేశారు. సీ్త్రల పట్ల వివక్ష కూడదని వివరించారు.
సమాజంలో చైతన్యం తీసుకురావాలి
బాలికల పట్ల వివక్ష లేకుండా సమాజంలో చైతన్యం తీసుకురావాలన్నారు. ముఖ్యంగా జూనియర్ కళాశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో అవగాహన కల్పించడం ద్వారా మంచి ఫలితాలు ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఆడపిల్లల పట్ల అవగాహన పెరిగిందని, అది మరింత పెరగడం మంచి శుభ పరిణామమని, ఆ విధంగా అవగాహన కల్పించనున్నట్టు చెప్పారు. కమిటీ సభ్యులు సూచించిన సలహాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో మరింత పటిష్టంగా చట్టాన్ని అమలు చేస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.కేవీఎస్ పద్మావతి, జిల్లా ప్రోగ్రాం అధికారి డా.టి.జగన్‌మోహన్‌రావు, డీఐవో డా.ఎం.నారాయణ, డీజీవో డా.సీహెచ్ కమలకుమారి, చిన్న పిల్లల వైద్యులు డా. వి.శ్రీధర్, రేడియోలజిస్ట్ డా.ఎం.జయరాం, సామాజిక కార్యకర్త శ్రీహరి, ఇతర వైద్యులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.