
పైడితల్లికి స్వర్ణపుష్పార్చన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి పైడితల్లికి శుక్రవారం స్వర్ణ పుష్పార్చన చేశారు. వేకువజాము నుంచి అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ఏడిద రమణ ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు అచ్యుతశర్మ, దూసి శివప్రసాద్ శాస్త్రోక్తంగా అమ్మవారికి స్వర్ణ పుష్పార్చన సేవను నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కుబడులు చెల్లించారు. ఆలయ ఇన్‌చార్జి ఈఓ కెఎన్‌వీడీవీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
● జేసీ సేతుమాధవన్
విజయనగరం అర్బన్: జిల్లాలోని పలు చోట్ల సోమవారం నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంకావాలని ఎన్నిక పరిశీలకుడు, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అధికారులకు సూచించారు. బొబ్బిలి మున్సిపల్ చైర్మన్, కొత్తవలస మండల కో ఆప్షన్ మెంబర్, గరివిడి మండలం సేరిపల్లి ఉప సర్పంచ్ పదవులకు ఈ నెల 19న నిర్వహించే ఎన్నికలపై తన చాంబర్‌లో అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన భద్రత, వీడియో గ్రఫీ, వెబ్ కెమెరాల ఏర్పాటు, మీడియా కవరేజీ, పార్టీ విప్ అనుసరణ, ఓటింగ్ పద్ధతులపై అధికారులకు అవగాహన కల్పించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ, డీపీఓ వెంకటేశ్వరరావు, బొబ్బిలి మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి విధులే క్రియాశీలకం
● ఎంఎస్‌పీలు, పోలీస్ సిబ్బందితో ఎస్పీ వకుల్ జిందల్
డెంకాడ: నేర నియంత్రణకు క్షేత్రస్థాయిలో ఎంఎస్‌పీలు, పోలీస్ సిబ్బంది నిర్వహించే విధులే క్రియాశీలకమని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. డెంకాడ పోలీస్ స్టేషన్ పక్కనే అభివృద్ధి చేసిన భవనంలో భోగాపురం సర్కిల్ కార్యాలయాన్ని, సీఐ చాంబర్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా పోలీసుల విధుల పర్యవేక్షణకు ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించామన్నారు. గ్రామాలపై నిఘా ఉంచాలని, కొత్తగా వచ్చే వక్తులు, పాతనేరస్తుల ప్రవర్తనను గమనించాలని ఎంఎస్‌పీలకు సూచించారు. భోగాపురం సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బందితో మాట్లాడుతూ ఈ–బీట్స్‌ను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను పర్యవేక్షించాలని, దత్తత గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, ఎస్‌బీఐ సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్.వి.ఆర్.కె.చౌదరి, ఎస్‌ఐలు ఎ.సన్యాసినాయుడు, ఐ.దుర్గాప్రసాద్, గణేష్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పైడితల్లికి స్వర్ణపుష్పార్చన

పైడితల్లికి స్వర్ణపుష్పార్చన