మాలధారణం..నియమాల తోరణం..
మహిమాన్వితం.. నృసింహ దీక్ష
శ్రీనృసింహ దీక్ష ఎంతో మహిమాన్వితమైనది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దీక్ష చేయ డం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రెండు దశాబ్దాల కిందటి వరకు కేవలం సింహాచలం ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ దీక్ష.. నేడు అనేక ప్రాంతాలకు విస్తరించింది. ఏటా ఏజెన్సీ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు దీక్ష చేస్తుండటం శుభపరిణామం.
–కె.సురేంద్ర, గురుస్వామి, సింహాచలం
సింహాచలం: వరాహ, నారసింహ రూపాల కలయికే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి. సింహగిరిపై కొలువైన స్వామి వారి అనుగ్రహం కోసం చేపట్టే పవిత్రమైన శ్రీనృసింహ దీక్షల స్వీకరణకు సమయం ఆసన్నమైంది. కఠిన నిష్టతో, భక్తి ప్రపత్తులతో స్వామిని కొలిచే ఆ పర్వదినాలు సమీపించడంతో సింహాచల క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగనుంది. ఈ ఏడాది శ్రీనృసింహ దీక్షల తేదీలను సింహాచలం దేవస్థానం అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 41 రోజుల మండల దీక్ష, ఈ నెల 11వ తేదీ నుంచి 32 రోజుల దీక్ష ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్ర రోజుల్లో దీక్షాధారులకు సింహగిరిపై దేవస్థానం వైదికులు ఉదయం పూట మాలధారణ చేస్తారు. వచ్చే ఏడాది జనవరి 12న దీక్షాధారులంతా దీక్ష విరమించాల్సి ఉంటుంది. మండల దీక్ష, 32 రోజుల దీక్ష చేపట్టిన భక్తులందరికీ జనవరి 12న ఉదయం సింహగిరిపైనే శాస్త్రోక్తంగా దీక్షను విరమింపజేస్తారు.
2015 నుంచి అధికారికంగా..
సింహాచలం దేవస్థానం 2015 నుంచి శ్రీనృసింహ దీక్షలను అధికారికంగా నిర్వహిస్తోంది. సుమారు 23 ఏళ్ల కిందట అడవివరానికి చెందిన కొందరు భక్తులు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఒక దీక్ష రూపంలో కొలవాలని సంకల్పించారు. అప్పట్లో దీనికి ‘చందన దీక్ష’గా నామకరణం చేసి, ఒక పీఠంగా ఏర్పడి దీక్షలు ప్రారంభించారు. ఏటేటా దీక్షాధారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దానికి అనుగుణంగానే పీఠాల సంఖ్య కూడా విస్తరించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మైదాన ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలైన ముంచంగిపుట్టు, హుకుంపేట, డుంబ్రిగుడ, అరకు, జి.మాడుగుల, పాడేరు, చెరువుపాకల, పెదగూడ, కుమ్మరిపుట్, చోడవరం, మాడుగుల చోట్ల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు ఈ దీక్షను స్వీకరించారు. అలాగే ఒడిశాలోని ఛత్రపురం, బరంపురం, గోపాలపురం ప్రాంతాల భక్తులు, తెలంగాణకు చెందిన పలువురు భక్తులు సైతం దీక్షను చేపట్టారు. ఈ క్రమంలో చందన దీక్షలను అధికారికంగా గుర్తించాలని భక్తులు దేవస్థానం అధికారులను కోరారు. ఎట్టకేలకు 2015లో ‘చందన దీక్ష’కు ‘శ్రీనృసింహ దీక్ష’గా నామకరణం చేసి దేవస్థానం అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది.
ఆధ్యాత్మిక శోభతో సింహగిరి క్షేత్రం
దశదిశలా విస్తరణకు కృషి
శ్రీనృసింహ దీక్షలు దశదిశలా విస్తరించాలని శ్రీ చందన పెరుమాళ్ పీఠం తరపున విశేషంగా కృషి చేస్తున్నాం. ఈ నెల 3న మా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మైదాన, ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఒడిశా రాష్ట్రం నుంచి సుమారు 1,500 మంది భక్తులు మండల దీక్ష స్వీకరిస్తున్నారు. దీక్షాధారులకు దేవస్థానం అందిస్తున్న సహకారం, ప్రోత్సాహం మరువలేనివి.
–సానబోయిన రాజు, గురుస్వామి, శ్రీ చందన పెరుమాళ్ పీఠం
తిరుముడి ద్రవ్యాలు
దీక్ష ముగింపు రోజున స్వామికి సమర్పించే ద్రవ్యాల మూటను తిరుముడిగా దేవస్థానం అర్చకులు నామకరణం చేశారు. కొబ్బరి కురిడీలు, చందనం చెక్క, పట్టువస్త్రం, ఆవు నెయ్యి, ముద ్దకర్పూరం, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, కుంకుమపువ్వు, పచ్చకర్పూరం, జీడిపప్పు, కిస్‌మిస్, పటికబెల్లం వంటి వాటిని తిరుముడిగా కట్టుకుని స్వామికి సమర్పించాలి.
దీక్షాధారుల నియమాలు
శ్రీనృసింహ దీక్ష స్వీకరించే భక్తులు తప్పనిసరిగా చందనం రంగు వస్త్రాలను ధరించాలి. నుదుటన తిరునామం పెట్టుకోవాలి. బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నది, చెరువు లేదా బావి నీటితో స్నానం ఆచరించాలి. కఠిన బ్రహ్మచర్యం పాటిస్తూ సాత్విక జీవనం గడపాలి.
సౌకర్యాలు కల్పిస్తున్నాం
శ్రీనృసింహ దీక్షాధారులకు దేవస్థానం తరపున అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. డిసెంబరు 3, 11 తేదీల్లో దీక్షలు స్వీకరించే వారికి సింహగిరిపైనే మాలధారణ చేస్తాం. తులసి మాల, స్వామి ప్రతిమను దేవస్థానం ఉచితంగా అందిస్తుంది. దీక్ష రోజుల్లో అన్నప్రసాద భవనంలో మధ్యాహ్న భోజనంతో పాటు, ఉచిత దర్శనం, దేవస్థానం బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. జనవరి 12న దీక్ష విరమణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తాం. ఈ అవకాశాలను భక్తులంతా సద్వినియోగం చేసుకోవాలి.
– ఎన్.సుజాత, ఇన్‌చార్జి ఈవో, సింహాచలం దేవస్థానం
పీఠం ఏర్పాటు ఇలా..
దీక్షాధారులు స్వయంగా గానీ, సామూహికంగా గానీ పవిత్రమైన ప్రదేశంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక పీటపై విష్వక్సేన, నృసింహస్వామి, లక్ష్మీదేవి, గోదాదేవి అమ్మవార్ల ప్రతిమలను ఉంచాలి. ప్రాతఃకాలంలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో విష్వక్సేన ఆరాధన, లక్ష్మీ అష్టోత్తరంతో అమ్మవారికి పూజ, నృసింహ అష్టోత్తరంతో స్వామికి పూజలు చేయాలి. ధనుర్మాసం రోజుల్లో గోదా దేవిని కూడా పూజించి, అనంతరం స్వామి వారి వైభవాన్ని కీర్తించాలి. రాత్రి పవళింపు సేవ నిర్వహించాలి.
శ్రీనృసింహ దీక్షలకు వేళాయె..
ఈ నెల 3 నుంచి మండల దీక్ష
ఈ నెల 11 నుంచి 32 రోజుల దీక్ష
జనవరి 12న రెండు దీక్షల ముగింపు
మాలధారణం..నియమాల తోరణం..
మాలధారణం..నియమాల తోరణం..
మాలధారణం..నియమాల తోరణం..
మాలధారణం..నియమాల తోరణం..
మాలధారణం..నియమాల తోరణం..
మాలధారణం..నియమాల తోరణం..


