అలరించిన సంగీత, నృత్య ప్రదర్శనలు
మద్దిలపాలెం: నిర్మాల మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ 30వ వార్షికోత్సవం శనివారం కళాభారతి ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన సంగీత, నృత్య ప్రదర్శనలు భారతీయ సంస్కృతి వైభవాన్ని కళ్లకు కట్టాయి. నగర పోలీసు కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి దంపతులు, అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్. వెంకటరావు, డైరెక్టర్ డాక్టర్ ఎస్. తిలగవతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ డాక్టర్ బాగ్చి మాట్లాడుతూ భారతీయ సంస్కృతికి ప్రతీకలైన సంప్రదాయ సంగీత నృత్యాలను నేటి యువత అద్భుతంగా ప్రదర్శించడం ప్రశంసనీయమన్నారు. వ్యవస్థాపకులు డాక్టర్ వెంకటరావు మాట్లాడుతూ 30 ఏళ్లలో అకాడమీ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలిచ్చి బహుమతులు అందుకుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విశిష్ట అతిథి డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్‌ను సత్కరించారు. కమిషనర్ శంఖబ్రత బాగ్చి దంపతుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు.


