అవగాహనే ఆయుధం
మహారాణిపేట: ఒకప్పుడు సమాజాన్ని భయపెట్టిన ఎయిడ్స్ మహమ్మారి తీవ్రత తగ్గుతోంది. గతంతో పోలిస్తే జిల్లాలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా తగ్గడం శుభపరిణామం. ప్రజల్లో పెరిగిన అవగాహన, ప్రభుత్వ యంత్రాంగం అందిస్తున్న వైద్య సేవలు, ఉచిత మందుల పంపిణీ సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 9,831 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉండగా, బాధితుల సంఖ్యలో రాష్ట్రంలో విశాఖ ఆరో స్థానంలో ఉంది. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా జిల్లాలోని పరిస్థితులపై కథనం.
ఫలిస్తున్న అవగాహన
ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తిపై ప్రజల్లో చైతన్యం పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. 2024–25 ఏడాదిలో 0.77 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు, 2025–26 ఏడాదిలో అక్టోబర్ నాటికి 0.66 శాతానికి తగ్గింది. గర్భిణులకు హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు విస్తృతంగా నిర్వహిస్తుండటంతో.. తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సోకే ప్రమాదాన్ని అరికట్టగలుగుతున్నారు. హెచ్‌ఐవీ సోకితే చావే శరణ్యం అనే భయాలను పారద్రోలుతూ.. అధికారులు బాధితులకు పూర్తి భరోసా కల్పిస్తున్నారు. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా 11,441 మంది బాధితులు(మిగతా జిల్లాలు కలిపి) యాంటీ రిట్రో వైరల్(ఏఆర్‌టీ) మందులను ఉచితంగా పొందుతున్నారు. వీరిలో 11,005 మంది పెద్దలు, 369 మంది పిల్లలు, 67 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. క్రమపద్ధతిలో మందులు వాడుతున్న 1,891 మందికి ప్రతి నెలా పింఛను అందిస్తున్నారు. ఏఆర్‌టీ మందులు వాడుతున్న 96 శాతం మందికి హెపటైటిస్–బి వ్యాక్సిన్ వేయించారు. దీని వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరిగి క్షయ వంటి ఇతర వ్యాధుల బారిన పడకుండా రక్షణ లభిస్తోంది. జిల్లాలోని 78 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. కిట్ల కొరత ఉందన్న వాదనలో నిజం లేదని, పరీక్షలకు కావాల్సిన అన్ని కిట్లు సిద్ధంగా ఉన్నాయని డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు స్పష్టం చేశారు.
వివక్ష వద్దు.. ఆదరణ ముద్దు
లైంగిక సంబంధాల ద్వారానే 90 శాతం మేర వ్యాధి వ్యాపిస్తోంది. బాధితుల్లో 15 నుంచి 49 ఏళ్ల లోపు వారు ఉన్నారు. అందుకే యువతలో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. 2030 నాటికి ఎయిడ్స్‌ను పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. బాధితులను హేళన చేయకుండా, వారికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. తద్వారా వారు సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ‘పరీక్షతో భరోసా.. నివారణతో రక్షణ’ అనే నినాదంతో ఎయిడ్స్ డేను నిర్వహిస్తున్నాం.
–డాక్టర్ రోణంగి రమేష్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి, విశాఖపట్నం
అవగాహనే ఆయుధం


