
ఉల్లి రైతుకు సబ్సిడీ
బంట్వారం: వానాకాలంలో ఉల్లి పంట సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ తరఫున ఎంఐడీహెచ్ వారు ఎకరాకు రూ.8 వేల చొప్పున సబ్సిడీ అందజేస్తారని కోట్‌పల్లి వ్యవసాయ విస్తరణ అధికారి సందీప్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉల్లి పంట వేసిన రైతులు స్థానిక ఏఈఓల దగ్గర పంట వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. ఐదు ఎకరాల వరకు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఇందుకు సంబంధించి పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రాలతో పాటు ఉల్లి విత్తనాలు కొనుగోలు చేసిన రసీదు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను ఏఈఓలకు అందజేయాలన్నారు. వానాకాలంలో ఉల్లి సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కంది విత్తనాల పంపిణీ
కొడంగల్: మండలంలోని అంగడి రాయిచూర్ గ్రామంలో 150 మంది రైతులకు బుధవారం ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేశారు. అధిక దిగుబడినిచ్చే మేలు రకం కంది విత్తనాలను అందజేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని కాంగ్రెస్ నాయకుడు గోడల రాంరెడ్డి అన్నారు. రైతులను ఆర్థికంగా ఆదుకోడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఏఈఓ పావని తదితరులు పాల్గొన్నారు.
ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి సూచించారు. జిల్లా వైద్యాధికారిగా డాక్టర్ లలిత బాధ్యతలు స్వీకరించిన అనంతరం బుధవారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాలు పడుతున్నందున ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తాము ముందుంటామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే బీఎంఆర్‌ను కలిసిన లలితాదేవి
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డిని జిల్లా వైద్యాధికారి లలితాదేవి బుధ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా చూడాలని, ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందేలా చొరవ చూపాలని ఎమ్మెల్యే సూచించారు.
అధిక ఫీజులను
నియంత్రించాలి
ఏబీవీపీ నాయకుల డిమాండ్
తాండూరు టౌన్: అధిక ఫీజు వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఈ మేరకు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా తాండూరు పట్టణంలోని కొన్ని ప్రైవేటు స్కూళ్లు అధిక ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. పుస్తకాలు, నోట్ బుక్స్ వారి వద్దే కొనుగోలు చేయాలని షరతు విధిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో సామాన్య ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. నిబంధనలు పాటించని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ అధ్యక్షుడు నర్సింలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజయ్, నాయకులు నవీన్, శ్రీకాంత్, రఘు తదితరులు పాల్గొన్నారు.

ఉల్లి రైతుకు సబ్సిడీ

ఉల్లి రైతుకు సబ్సిడీ

ఉల్లి రైతుకు సబ్సిడీ