
జలం.. కలుషితం
తాగునీటి అవసరాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా ప్రజల దాహం మాత్రం తీరడం లేదు. మిషన్ భగీరథ, వాటర్ ట్యాంకులు, బోరు బావులు, నల్లా కనెక్షన్లు ఎన్ని ఉన్నా నిత్యం తాగునీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.
● గాడిన పడని తాగునీటి సరఫరా ● వర్షాలు పడుతున్నామెరుగుపడని పరిస్థితి ● ప్రజల దాహం తీర్చని ‘భగీరథ’ ● ప్రైవేటులో కొనుగోలు చేస్తున్న జనం ● పట్టించుకోని అధికార యంత్రాంగం
వికారాబాద్: మున్సిపల్ పరిధిలో రోజు తప్పించి రోజు తాగునీరు సరఫరా అవుతోంది. లీకేజీల కారణంగా తాగునీరు కలుషితం అవుతుండటంతో 90శాతం ప్రజలు ఆ నీళ్లు తాగడంలేదు. దాదాపు 90శాతం అవసరాలకు మిషన్ భగీరథ పథకంతీరుస్తోంది. మిగతా లోటును బోరు బావులు, హ్యాండ్ పంపుల ద్వారా పూడుస్తున్నారు. పలుచోట్ల తరచూ పైప్‌లైన్లు లీకేజీలు అవుతున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు అధికారుల దృష్టికి తెచ్చినా తక్షణం స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మిషన్ భగీరథ పథకం పైప్‌లైన్‌కు అమర్చిన ట్యాప్‌లు, మీటర్లను చాలా వరకు ప్రజలు తొలగించారు. దీంతో తాగునీరు వృథాగా పోతోంది. అంతేకాకుండా నల్లాల వద్ద నిలిచి నీటి సరఫరా ఆగిపోయిన తర్వా త పైపుల్లోకి చేరి కలుషితమవుతున్నాయి. మరుసటి రోజు వండ్రు నీరు వస్తోంది. దీంతో ఆ నీటిని ప్రజలు తాగడం లేదు. చాలా మంది బుబుల్స్ కొనుగోలు చేసి దాహం తీర్చుకుంటున్నారు.
10,600 నల్లా కనెక్షన్లు
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో మొత్తం 16,000 ఆవాసాలు ఉండగా 70 వేల జనాభా నివసిస్తున్నారు. వీరికి మిషన్ భగీరథ నామ్స్ ప్రకారం రోజుకు ఒకరికి 100 లీటర్ల చొప్పున సరఫరా చేయాల్సి ఉంది. ఈ లెక్కన మున్సిపాలిటీకి రోజుకు 7 ఎంఎల్‌డీ (మిలియల్ లీటర్ ఫర్‌డే) నీళ్లు అవసరం. ప్రస్తుతం రోజు తప్పించి రోజు సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ పథకం కింద 14 ఎంఎల్‌డీ వాటర్ సరఫరా చేయాల్సి ఉండగా ప్రస్తుతం 10.4 ఎంఎల్‌డీ సరఫరా చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో 198 బోరు బావులు, 56 చేతిపంపులు ఉన్నాయి. నల్లాలు లేని చోట వాటిని వినియోగిస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైనా భూగర్భ జలాలు పెరగలేదు. ఇది ప్రజల తాగునీటి అవసరాలపై ప్రభావం చూపుతోంది.
పైప్‌లైన్ లీకేజీలతో సతమతం
వికారాబాద్ మున్సిపల్ జనాభా 70 వేలు
మొత్తం నివాసాలు 16వేలు
నల్లా కనెక్షన్లు 10,600
రోజుకు అవసరమైన తాగునీరు 14 ఎంఎల్‌డీ
సరఫరా అవుతున్నది 10.4 ఎంఎల్‌డీ

జలం.. కలుషితం