
ఓటరు జాబితా పక్కాగా ఉండాలి
కొడంగల్: బూత్ లెవల్ అధికారులు ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల వివరాలను పరిశీలించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో నిర్వహించిన జాతీయ శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బీఎల్‌ఓలకు, సూపర్ వైజర్లకు ఒక్కరోజు శిక్షణ, అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫారం 6, 7, 8 నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఓటరు జాబితాలో అవసరమైతే పాత ఫొటోలను తొలగించి కొత్త ఫొటోలను అప్‌లోడ్ చేయాలన్నారు. పేర్లలో తప్పులు ఉంటే సవరించాలని సూచించారు. ఫారం 6 ద్వారా కొత్త ఓటర్లను నమోదు చేయాలని తెలిపారు. కుటుంబ సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేలా చూడాలని ఆదేశించారు. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. పేరు మార్పుల కోసం ఫారం 8 వినియోగించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంఈఓ రాంరెడ్డి, మాస్టర్ ట్రైనర్లు, బీఎల్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
బీఎల్‌ఓలు ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలి
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్