
ప్రత్యేక బస్సు ప్యాకేజీ
తాండూరు టౌన్: రానున్న గురుపౌర్ణమిని పురస్కరించుకుని గానుగాపూర్‌లోని దత్తాత్రేయ స్వామి దర్శనార్ధం వెళ్లనున్న భక్తుల కోసం తాండూరు ఆర్‌టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు ప్యాకేజీని తీసుకొచ్చినట్లు డిపో మేనేజర్ సురేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీ సాయంత్రం 5గంటలకు తాండూరు బస్టాండ్ నుంచి బయలుదేరనున్న బస్సు కల్బుర్గిలోని శరణు బసవేశ్వర టెంపుల్ దర్శనానంతరం గానుగాపూర్‌కు చేరుకుంటుందన్నారు. 10వ తేదీన దత్తాత్రేయ స్వామి దర్శనానంతరం బయలుదేరి అదే రోజు సాయంత్రం 5గంటలకు తాండూరుకు చేరుకోనున్నట్లు తెలిపారు. స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బస్సులో ప్రయాణించే ఒక్కో ప్రయాణికుని వద్ద రూ.700 చొప్పున చార్జీలు వసూలు చేయనున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ముందస్తుగా తమ సీట్లను బస్ స్టేషన్‌కు వచ్చి బుక్ చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాలకు సెల్ నంబర్ల 9959226251, 9441717503, 830934 8157లో సంప్రదించాలన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
నేడు పీఎస్ భవనాలకు భూమిపూజ
కొడంగల్: నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాల్లో శుక్రవారం పోలీస్ స్టేషన్ల నూతన భవన నిర్మాణాలకు భూమిపూజ చేయనున్నారు. కొడంగల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంతో పాటు కొడంగల్, దుద్యాల్, బొంరాస్‌పేట మండల కేంద్రాల్లో నూతన భవనాల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. కొడంగల్‌లోని పాత పోలీస్‌స్టేషన్ స్థలంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టనున్నారు. గురువా రం మార్కింగ్ వేయించారు. భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో పాటు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తిరుపతిరెడ్డి, జిల్లా అధికారులు హాజరవుతారని తెలిపారు.
సర్కారు వారి చేతి సంచులు!
బొంరాస్‌పేట: రేషన్ కార్డుదారులకు ప్రభు త్వం త్వరలో చేతి బస్తాలు (క్యారీ బ్యాగులు) అందించనుంది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతీ కార్డుదారునికి ఒక్కో బ్యాగు చొప్పున ఇస్తారు. ఆరు గ్యారంటీల లోగో, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల ఫొటోలతో ఉన్న ఈ హ్యాండ్ బ్యాగులు ఇప్పటికే స్టాక్ పాయింట్లకు చేరాయి. వారం రోజుల్లో వీటిని రేషన్ దుకాణాలకు పంపిస్తారు.

ప్రత్యేక బస్సు ప్యాకేజీ