
మద్యం మత్తులో కత్తితో దాడి
ఏర్పేడు : మండలంలోని గుండ్లకండ్రిగ ఎస్టీ కాలనీలో గురువారం ఓ వ్యక్తిపై మరొకరు కత్తితో నరికి తీవ్రంగా గాయపరిచాడు. క్షతగాత్రుడు తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏర్పేడు సీఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపిన వివరాలు.. గుండ్లకండ్రిగ ఎస్టీ కాలనీకి చెందిన సీతారాముడు మద్యం తాగి వీధిలో వెళుతూ, పక్కన కూర్చుని ఉన్న కేశవులు(45)ను మద్యం మత్తులో కత్తితో తలపై నరికాడు. తలపై బలమైన రక్తగాయం కావడంతో కేశవులు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. క్షతగాత్రుని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పాత కక్షలేవైనా.. ఉన్నాయా.. మద్యం మత్తులో నరికాడా.. అనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
నేడు ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్
తిరుపతి సిటీ : ఈఏపీసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియకు సాంకేతిక విద్యాశాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాల కోసం సుదీర్ఘకాలం వేచి చూసిన విద్యార్థులకు కాస్త ఊరట లభించింది. విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా ఈనెల 7 నుంచి 16వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపునకు అవకాశం ఇస్తూ 18 వరకు వెబ్ ఆప్షన్లకు ఎంట్రీకి అవకాశం కల్పించనున్నారు. 22న సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేయనున్నారు. 23 నుంచి 26వ తేదీ వరకు సీట్లు కేటాయించిన కళాశాలలో విద్యార్థులు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ఆగష్టు 4వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మే 21 నుంచి 27 వరకు ఈఏపీసెట్ (ఎంసెట్) పరీక్షలు నిర్వహించగా జూన్ 8న ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదలై సుమారు నెల రోజుల తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడుతుండటం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో వేల సంఖ్యలో విద్యార్థులు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు పొందిన విషయం తెలిసిందే.