
ఎస్వీ యూ అధికారుల ‘స్టంట్లు’
తిరుపతి సిటీ: ఎస్వీయూ అధికారులు డిగ్రీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ స్టంట్లు చేస్తున్నారు. ఇన్‌స్టంట్ పరీక్షలకు ఫీజులు కట్టుకున్నారు కానీ వర్సిటీ నిబంధనల ప్రకారం హాల్ టికెట్లు పొందడానికి మాత్రం వారికి అర్హత లేదంటూ ప్రకటించారు. దీంతో మంగళవారం ఎస్వీయూ పరీక్షల విభాగం వద్ద సుమారు వంద మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ 2022–25 బ్యాచ్ డిగ్రీ విద్యార్థులకు సంబంధించి 5వ సెమిస్టర్ ఇన్‌స్టంట్ పరీక్షలకు ఫీజులు కట్టించుకుని హాల్‌టికెట్లు జారీ చేయలేదన్నారు. అడిగితే వర్సిటీ నూతన నిబంధనల ప్రకారం మీరు అర్హులు కాదని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ సెక్షన్ అధికారులు రిజిస్ట్రార్, వీసీలను సంప్రదించి చర్చలు జరిపారు. ఫలితంగా 2022–25 బ్యాచ్ విద్యార్థులకు ఐదవ సెమిస్టర్ పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లు జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందుకోసం బుధవారం నుంచి జరగనున్న ఇన్‌స్టంట్ పరీక్షలను వచ్చే జూలై 7 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీంతో విద్యార్థులు వెనుదిరిగారు.
ఏడు పాఠశాలల్లో ఆధార్ నమోదు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఆధారు కార్డు లేని 1నుంచి 10వ తరగతి చదివే విద్యార్థుల సౌకర్యార్థం తిరుపతి జిల్లాలో 7 పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) డాక్టర్ కేవీఎన్.కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా గూడూరు జెడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్, జెడ్పీహెచ్‌ఎస్ బాయ్స్, నాయుడుపేట జెడ్పీహెచ్‌ఎస్ బాయ్స్, తిరుచానూరు జెడ్పీహెచ్‌ఎస్, తిరుపతిలోని ఎస్పీజేఎన్‌ఎం నగరపాలక హైస్కూల్, శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు జెడ్పీహెచ్‌ఎస్, పుత్తూరు జెడ్పీహెచ్‌ఎస్ గర్‌ల్స్ పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. యూడైస్ లో విద్యార్థుల వివరాలను నమోదు చేసేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో వారికి అందేందుకు ఆధార్ తప్పనిసరి కావడంతో డీవైఈఓలు, ఎంఈఓలు, హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు తమ పరిధిలో ఆధార్ లేని విద్యార్థులను గుర్తించి సమీప పాఠశాలల్లో ఆధార్ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ పేర్కొన్నారు.
ఏపీపీఈసెట్
ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: ఆచార్య నాగార్జున వర్సిటీ ఆధ్వర్యంలో జూన్ 25, 26వ తేదీల్లో నిర్వహించిన ఏపీపీఈసెట్–2025 పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల చేశారు. వర్సిటీలోని బీపీఈడీ, డీపీఈడీ రెండేళ్ల కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు ఎస్వీయూ పరిధిలో 492 మంది పరీక్షకు హాజరుకాగా 463మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో పురుషులు 344మంది, మహిళలు 119మంది ఉన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 11మంది విద్యార్థులు టాప్ 50ర్యాంకులల్లో చోటు సంపాదించారు.