
ఓవర్ లోడ్.. ఐదు ఆటోలు సీజ్
తిరుపతి మంగళం : అద్దెలకు కక్కుర్తి పడి ఆటోల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న 5 ఆటోలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. జిల్లా రవాణా శాఖాధికారి ఆదేశాల మేరకు సోమవారం మోటారు వాహన తనిఖీ అధికారులు శ్రీనివాసరావు, అథికానాజ్, మోహన్‌కుమార్ అలిపిరి భారతీయ విద్యాభవన్, ఎమ్మార్ పల్లి కూడలి ప్రాంతాల్లో విద్యార్థులను తరలించే ఆటోలను తనిఖీలు చేశారు. పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్న ఐదు ఆటోలను సీజ్ చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లకు విద్యార్థుల భద్రతపై అవగాహన కల్పించారు. జిల్లా రవాణాశాఖాధికారి మురళీమోహన్ మాట్లాడుతూ, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి కళాశాలలు, పాఠశాలల బస్సులతో పాటు విద్యార్థులను తరలించే ఆటోలను నిత్యం తనిఖీలు చేస్తున్నామన్నారు. అందుకోసం మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులను తరలించే వాహనాలకు ఎఫ్‌సీలు లేకపోయినా, ఆర్టీఏ నిబంధనలు పాటించకపోయినా, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించుకున్నా, అధిక వేగంతో వెళ్లినా, మద్యం తాగి వాహనాలను నడిపినా వాహనాలను సీజ్ చేయడంతో పాటు వాహన డ్రైవర్ల లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు.