
పరిశోధనకు గణాంక శాస్త్రమే కీలకం
తిరుపతి సిటీ : పరిశోధన రంగంలో గణాంకశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నేషనల్ స్టాటిస్టిక్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత గణాంకశాస్‌త్ర పితామహుడు ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ చిత్రపటానికి నివాళులర్పించారు. వీసీ మాట్లాడుతూ తిరుపతి ఐఎస్‌పీఎస్‌లో డేటా సైన్స్ సెంటర్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సెంటర్ వర్తమాన గణాంకవేత్తలకు నాలెడ్జ్ హబ్‌గా మారాలని ఆకాంక్షించారు. ఐఎస్‌పీఎస్ గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ పి.రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ డేటా సైన్స్ సెంటర్ అనువర్తిత పరిశోధకులకు కన్సల్టెన్సీ కేంద్రంగా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గణాంకవేత్త ప్రొఫెసర్ వెంకట్ ఇక్కుర్తి, ప్రొఫెసర్ ఎన్ బాలకృష్ణ, యూబీఐ రీజనల్ హెడ్ ఎల్‌ఎస్‌వీఆర్ శర్మ, యూనియన్ బ్యాంక్ తిరుపతి జోనల్ హెడ్ శ్రీనివాస కుమార్, ఎస్వీయూ మాజీ రెక్టార్ సాంబశివారెడ్డి, ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, డాక్టర్ చంద్రమౌళి, ప్రొఫెసర్ విశ్వనాథన్, ప్రొఫెసర్ పార్థసారధి, డాక్టర్ శివపార్వతి పాల్గొన్నారు.
శ్రీశక్తి పీఠంలో టీటీడీ చైర్మన్
రామచంద్రాపురం : రాయలచెరువు సమీపంలో వెలసిన శ్రీశక్తిపీఠాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు ఆదివారం సందర్శించారు. వారాహీ నవరాత్రులను పురస్కరించుకుని పాతాళ శ్వేత వారాహి క్షేత్రంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే మరకత శక్తి కాళీదేవి, మరకత సిద్ధేశ్వరస్వామివారిని సేవించుకున్నారు. అనంతరం శ్రీశక్తి పీఠాదేశ్వరీ మాతాజీ రమ్యానంద భారతి స్వామిని మర్యాద పూర్వకంగా కలిశారు. టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ మాతాజీని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయనను శక్తిపీఠం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. వైదేహీమాలను బహూకరించారు.
సిరులతల్లికి వెండి తుంగవాలికలు
చంద్రగిరి: తిరుచానూరు పద్మావతీదేవికి భక్తులు రెండు వెండి తుంగవాలికలను (గొలుసు దీపా లు) విరాళంగా అందజేశారు. ఆదివారం హైదరాబాదుకు చెందిన శ్రీవారి భక్తుడు వీరాంజనేయులు రూ.3.27లక్షల విలువైన సుమారు 3 కిలోల బరువు గల వెండి తుంగవాలికలను కుటుంబ సభ్యులతో కలసి ఆలయ ఏఈఓ దేవరాజులుకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. వేద పండితులు ఆశీర్వచనం పలుకగా, అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

పరిశోధనకు గణాంక శాస్త్రమే కీలకం

పరిశోధనకు గణాంక శాస్త్రమే కీలకం