
బాసరకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు
● జూలై 4 నుంచి తిరుపతి–నాందేడ్‌కు రాకపోకలు ● నూతన మార్గంలో మొదటి ప్రయాణం ● షిరిడీ సాయి భక్తులకు అనుకూలం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తెలంగాణా రాష్ట్రం బాసర క్షేత్రంలోని సరస్వతి దేవి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. తిరుపతి నుంచి బాసరకు జూలై 4వ తేదీ నుంచి ప్రత్యేక రైలు అందుబాటులోకి రానుంది. తిరుపతి –నాందేడ్ ఽమధ్యలో ప్రత్యేక రైలు నడిపేందుకు చర్యలు తీసుకుంది. ఈ రైలును పిడుగురాళ్ల–శావల్యపురం మధ్య నూతనంగా నిర్మించిన మార్గం ద్వారా మార్కాపురం, నంద్యాల, కడప, రేణిగుంట నుంచి మొదటిసారిగా తిరుపతికి నడపనున్నారు. జూలై 11, 18, 25 తేదీలలో తిరుపతికి, అదే నెల 6, 19, 20, 27 తేదీలలో నాందేడ్‌కు ప్రయాణిస్తుంది. షిర్డి వెళ్లాలనుకునే భక్తులు నాందేడ్ వరకు ప్రయాణించి అక్కడి నుంచి తక్కువ సమయంలో షిర్డి సాయిబాబాను దర్శించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.
రైలు రాకపోకల సమయం ఇలా...
నాందేడ్‌లో సాయంత్రం 4.30కి బయలు దేరి బాసర 6 గంటలకు, నిజామాబాద్ 6.25 గంటలకు చేరుకుంటుంది. కామారెడ్డి మీదుగా మేడ్చల్ రాత్రి 8 గంటలకు, చెర్లపల్లి 9.30 గంటలకు, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి మీదుగా పిడుగురాళ్లకు అర్ధరాత్రి 12.30 గంటలకు చేరుకుంటుంది. దొనకొండ, మార్కాపురం రోడు, కంభం, గిద్దలూరు నుంచి నంద్యాలకు వేకువజాము 5.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మీదుగా కడపకు 8.30 గంటలకు వస్తుంది. రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదే రైలు మళ్లీ తిరుగు ప్రయాణం తిరుపతిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి కడపకు 4.15కు చేరుకుని మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి తిరుపతి వరకు ప్రయాణిస్తుంది.