
పాలిటెక్నిక్ విద్యలో మార్పులకు శ్రీకారం
● రాష్ట్ర సాంకేతిక విద్య డైరెక్టర్ గణేష్‌కుమార్
తిరుపతి ఎడ్యుకేషన్ : ప్రస్తుత పారిశ్రామిక రంగానికి అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సుల్లో మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య డైరెక్టర్ జి.గణేష్‌కుమార్ వెల్లడించారు. పాలిటెక్నిక్ డిప్లొమో కరికులంపై బుధవారం తిరుపతిలోని ఓ హోటల్‌లోరాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా బోర్డు (ఎస్‌బీటీఈటీ) ప్రాంతీయ వర్క్‌షాపు నిర్వహించింది. ముఖ్య అతిథిగా గణేష్‌కుమార్ ఆన్‌లైన్‌లో హాజరై మాట్లాడారు. డిప్లొమో కోర్సుల విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వీరిని చేరికకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. అయితే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కరికులంలో మార్పులు అవసరమని గుర్తించామని, వర్క్‌షాపులో పలువురు పారిశ్రామికవేత్తలు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పాలిటెక్నిక్ ప్రిన్సిపాళ్లు, టీచర్లతో చర్చించి కరికులం మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. సాంకేతిక విద్య ఆర్జేడి ఎ.నిర్మల్‌కుమార్ ప్రియ మాట్లాడుతూ, మారుతున్న సాంకేతికతకు కాలానుగుణంగా నైపుణ్యాల పెంపు, అలాగే ఆన్‌లైన్ మూల్యాంకనాన్ని ప్రవేశ పెట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. అనంతరం పలు అంశాలపై చర్చించి అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమంలో సాంకేతిక విద్య కార్యదర్శి జీవి.రామచంద్ర, సంయుక్త కార్యదర్శి జీవి.సత్యనారాయణమూర్తి, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎంఏవీ.రామకృష్ణ, నాస్కామ్ ప్రతినిధి డాక్టర్ చింతల సంధ్య తదితరులు పాల్గొన్నారు.