
నవధాన్యాల సాగుతో సారవంతం
తడ : భూమిని సారవంతంగా మార్చేందుకు వివిధ రకాల నవధాన్యాలు సాగు చేసి, పూత దశలో భూమిలో కలియ దున్నడం వల్ల భూమి సారవంతంగా మారుతుందని, తద్వారా భూమిలో సేంద్రియ కర్భన శాతం పెరగడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని తిరుపతి జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి స్వామి కొండయ్య రైతులకు సూచించారు. వెండ్లూరుపాడు గ్రామంలో పర్వతరెడ్డి కిషోర్‌రెడ్డి అనే ప్రకృతి వ్యవసాయ రైతు తన ఇంటి వద్దే ఏర్పాటు చేసిన బయో రిసోర్స్ సెంటర్‌ను కొండయ్య మంగళవారం ప్రారంభించారు. ప్రతి రైతుకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన ఉండాలని కోరారు. బియ్యం, చిరుధాన్యాలు వంటివి వివిధ రకాల ఉత్పత్తులను వినియోగదారులకు బయో రిసోర్స్ సెంటర్ ద్వారా అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి బయో రిసోర్స్ యంటీ సత్యనారాయణ, యూనిట్ ఇన్ చార్జులు రమణ, శ్రీనివాసులు, మారెయ్య, నిర్మల, సంజీవయ్య పాల్గొన్నారు.