
అధికారుల నిర్లక్ష్యంతోనే విద్యార్థులకు అస్వస్థత
ఎంపీ గురుమూర్తి ఆగ్రహం
తిరుపతి మంగళం : శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ బాలుర బీసీ హాస్టల్‌లో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తిరుపతి ఎంపీ గురుమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలుషిత ఆహారం కారణంగా పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తిరుపతి పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో సుమారు 16 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురై శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్‌కు తరలించిన విషయం తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న ఎంపీ ఫోన్ ద్వారా స్థానిక ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని దగ్గరుండి చూసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారితో మాట్లాడిన ఎంపీ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకు అందించే ఆహారం విషయంలో నిర్లక్ష్య ధోరణి సహించారానిదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.