వెంటాడుతున్న నిపుణుల కొరత | - | Sakshi
Sakshi News home page

వెంటాడుతున్న నిపుణుల కొరత

Mar 31 2025 11:06 AM | Updated on Mar 31 2025 1:15 PM

వెంటాడుతున్న నిపుణుల కొరత

వెంటాడుతున్న నిపుణుల కొరత

మాట్లాతుడుతున్న జడ్జి రామగోపాల్‌

తిరుపతి కల్చరల్‌ : భారతదేశంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉందని పలువురు వక్తలు తెలిపారు. యశోదానగర్‌లోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం అత్యాధునిక శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఐదో అడిషనల్‌ కోర్టు జడ్జి జి.రామగోపాల్‌ ప్రారంభించారు. ఐఐటీ డైరెక్టర్‌ కెఎస్‌.సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో ఒక ఇంజినీరు ఉంటే పది మంది డిప్లొమా హోల్డర్లు, ఒక డిప్లొమా హోల్డర్‌కు పది మంది ఐటీఐ నిపుణులు ఉండాలని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. ఇంజినీర్లు ఎక్కువ మంది వస్తున్నారని, వారి కింద పని చేయాల్సిన నైపుణ్యం కల వారు తక్కువ మంది వున్నారని తెలిపారు. భవిష్యత్తులో కృత్రిమ మేధ ప్రజల భవిష్యత్తును శాసించనుందని వివరించారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం స్థానంలో విద్యా, వైద్య కేంద్రంగాను, ఎలక్ట్రానిక్‌ మానుప్యాక్చరింగ్‌ క్లస్టర్‌గాను అభివృద్ధి చెందుతోందన్నారు. ఇది వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తోడ్పడుతుందన్నారు. జడ్జి రామగోపాల్‌ మాట్లాడుతూ తాను ఏలూరు జైలును సందర్శించిన సమయంలో ఆశ్చర్యకరమైన విషయాలు తన దృష్టికి వచ్చాయని గుర్తు చేసుకున్నారు. చిన్న చిన్న నేరాలు చేసి నేర ప్రవృత్తికి అలవాటు పడిన 200 మందిని పరిశీలించినట్టు తెలిపారు. వారిలో బీటెక్‌, పీజీ, డిగ్రీ స్థాయికి మించి చదివిన వారే అత్యధికులని వివరించారు. చదివిన చదువులకు ఉపాధికి సంబంధం లేని పరిస్థితి ఏర్పడడంతోనే అలాంటి దురదృష్టకర పరిణామం కొనసాగుతోందన్నారు. గ్రామాల నుంచి వలసలు పెరిగాయని గుర్తు చేశారు. కంప్యూటర్‌ ల్యాబ్‌లో అన్ని రకాల కోర్సులను నామమాత్రపు రుసుముతో నేర్పించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుడా మాజీ కార్యదర్శి వెంకటనారాయణ, సోషల్‌ వేల్ఫేర్‌ విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ టి.విక్రమ్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది పురుషోత్తంరెడ్డి, ఉపవిద్యాశాఖాధికారి బాలాజీ, ఏంబీ విజ్ఞాన కేంద్రం విజయవాడ బాద్యుడు మురళీకృష్ణ, ఎంఈవో హేమాలిని, వేమన విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి మల్లారపు నాగార్జున, ముఖేష్‌, టెంకాయల దామోదారం, లక్ష్మీనారాయణ, తహసున్సీషా, రెడ్డెప్ప, రఫీ, గురునాథం, మునిరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement