
చిట్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి.. ఉషాకిరణ్ సంస్థల్లోకి మళ్లిస్తున్నారంటూ..
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ గురువారంతో ముగిసింది. ఇరు వర్గాల వాదనలు విన్న బెంచ్.. తీర్పును రిజర్వ్ చేసింది. ఏపీ సీఐడీ పెట్టిన కేసులు కొట్టేయాలని మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఐడీ తరపున వాదనలు వినిపించారు ఏపీ ప్రభుత్వ న్యాయవాది గోవిందరెడ్డి.
విచారణను ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు ట్రాన్స్‌ఫర్ కోరవచ్చు. కానీ, దర్యాప్తును పక్క రాష్ట్రంలోని సంస్థలతో చేయాలని కోరలేరని వాదించారాయన. అంతేకాదు.. చిట్స్ పేరుతో డబ్బు సేకరించి ఉషాకిరణ్ లాంటి సంస్థల్లోకి మళ్లిస్తున్నారని, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది బెంచ్‌కు తెలిపారు. ఆ సంస్థలు గనుక నష్టాల్లోకి వెళ్తే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని, ఎఫ్‌ఐఆర్ దశలో దర్యాప్తును అడ్డుకోవాలని నిందితులు చూస్తున్నారని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు.
మోసాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, నేరాలన్నీ కాగ్నిజబుల్ నేరాలేనని కోర్టుకు విన్నవించారు. అందుకే లోతైన దర్యాప్తు అవసరం ఉందని ప్రభుత్వ న్యాయవాది బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ప్రభుత్వం గనుక చర్యలు చేపట్టకుంటే.. భవిష్యత్తులో వేలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదముందని మరోసారి ఉన్నత న్యాయస్థానానికి తెలిపారాయన. ఇక వాదనలు పూర్తి కావడంతో.. తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు.