
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న తర్ణం వాగు
సిద్దిపేట జిల్లా గౌరారంలో 23.6 సెం.మీ వర్షం
పలు జిల్లాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు.. ఇళ్లలోకి వరద
జాతీయ రహదారులపైనా వరద.. రాకపోకలకు అంతరాయం
జలదిగ్బంధంలో గ్రామాలు.. చెరువుల్ని తలపిస్తున్న పొలాలు
మహారాష్ట్రలో గల్లంతయిన జగిత్యాల మహిళలు
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి, సిద్దిపేట, ఆసిఫాబాద్, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ములుగు, మంచిర్యాల, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయి. హైదరాబాద్ నగరంలో ఆదివారం రాత్రి 8 గంటలకు మొదలైన వాన సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది.
జిల్లాల్లో అనేకచోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో 23.6 సెం.మీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలుచోట్ల జనావాసాల్లోకి సైతం వరద నీరు చేరింది. కొన్నిచోట్ల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
రాజీవ్ రహదారిపై వరద
కుంభవృష్టితో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై వరదనీరు చేరడంతో కరీంనగర్–హైదరాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలకు ఒకింత అంతరాయం ఏర్పడింది. పంటపొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంబర్‌పేట–శాకారం మార్గంలో రవాణా స్తంభించి పోయింది.
గుండాల మండలంలో 16 సెం.మీ వర్షం
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో 16 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. దీంతో నిన్నటి వరకు చుక్కనీరు లేని శామీర్‌పేట, చిన్నేరు వాగులు పరవళ్లు తొక్కుతున్నాయి. బిక్కేరు, మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాజ్‌వేల పైనుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు. జిల్లాలోనే అతి పెద్దదైన తుర్కపల్లి మండలంలోని గంధమల్ల చెరువు అలుగుపోస్తోంది. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో జెడ్పీహెచ్‌ఎస్, కేజీబీవీ మళ్లీ జలమయమయ్యాయి. కేజీబీవీకి సోమవారం కూడా సెలవు ఇచ్చారు.
చెరువుల్లా పంట పొలాలు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలోని దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 1000 చెరువులు అలుగు పారుతున్నాయి.
కొట్టుకుపోయిన కోళ్లు..కారు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో 16.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. హత్నూర మండలం ఎల్లమ్మగూడ శివారులోని కాలువ కట్ట కొట్టుకుపోయి సమీపంలో ఉన్న ఫౌల్ట్రీఫాంను వరద ముంచెత్తడంతో కొన్ని కోళ్లు కొట్టుకుపోయాయి. 3 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామ శివారులో పొంగి ప్రవహిస్తున్న వాగులో పవన్ అనే వ్యక్తికి చెందిన కారు కొట్టుకు పోయింది. పవన్ ప్రమాదం నుంచి బయట పడ్డాడు.
వరద తగ్గిన తర్వాత పోలీసులు కారును బయటకు తీశారు. మంజీరా నది మహోగ్ర రూపం దాల్చింది. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన వనదుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలోనే కొనసాగుతోంది. కల్యాణి , పోచారం ప్రాజెక్టులు ఉధృతంగా అలుగు పోస్తున్నాయి. వందలాది చెరువులు నిండాయి. బాన్సువాడ నుంచి కామారెడ్డికి వచ్చే రహదారిపై సర్వాపూర్ వాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో 16.2 సెం.మీ వర్షం కురిసింది.
మహారాష్ట్రకు నిలిచిన రాకపోకలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షానికి పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ప్రాణహిత, పెన్‌గంగ, వార్దా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిర్పూర్(టి) నుంచి మహారాష్ట్రకు అంతర్రాష్ట్ర రహదారి గుండా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ములుగులో పోటెత్తుతున్న వాగులు
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వద్ద జాతీయ రహదారిపై ఉన్న 163 హైలెవల్ వంతెన వద్ద రెండు కిలోమీటర్ల పొడువునా గోదావరి వరద నీరు ప్రవహిస్తోంది. కొండాయి వద్ద జంపన్నవాగు, ఎలిశెట్టిపల్లి వద్ద జంపన్నవాగు, గోగుపల్లివాగు, ఏటూరునాగారం–భద్రాచలం రహదారి మధ్యలోని జీడివాగు, మంగపేట మండలంలోని కమలాపురం వద్ద ఎర్రవాగు, కన్నాయిగూడెం మండలంలోని హనుమంతుల వాగు, ముళ్లకట్ట వద్ద మేడివాగు పొంగిపొర్లుతున్నాయి.
ఏటూరునాగారం–బూర్గంపాడు ప్రధాన రోడ్డుపై నుంచి రెండు మీటర్ల ఎత్తులో వరదనీరు ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు వరద పరిస్థితిని సమీక్షించారు.
గొర్రెల కాపరులు, రైతును రక్షించిన ఎన్‌డీఆర్‌ఎఫ్
కామారెడ్డి జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. జిల్లాలో అత్యధికంగా పిట్లంలో 17.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిజాంసాగర్, మహహ్మద్‌నగర్, నస్రుల్లాబాద్, మండలాల్లో 12 సెం.మీ నుంచి 16 సె.మీ. వర్షం కురిసింది. ఆదివారం అర్ధరాత్రి నిజాంసాగర్ గేట్లు ఎత్తడంతో మంజీరలో ప్రవాహం పెరిగి బిచ్కుంద మండలం శెట్లూర్ వద్ద ప్రవాహంలో ముగ్గురు గొర్రెల కాపరులు, ఒక రైతు చిక్కుకున్నారు. 656 గొర్రెలు కూడా నీటి మధ్యలో ఉండిపోయాయి. అధికారులు సోమవారం తెల్లవారుజామున ఎన్‌డీఆర్‌ఎఫ్ బృ«ందాల సాయంతో గొర్రెల కాపరులు, రైతును రక్షించారు. అలాగే గొర్రెలను బయటకు తీసుకువచ్చారు.
మహారాష్ట్ర వరదల్లో ముగ్గురు మహిళల గల్లంతు
– జగిత్యాలలోని టీఆర్‌నగర్‌లో విషాదం
జగిత్యాల క్రైం: మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని కారులో తిరుగు ప్రయాణమైన ముగ్గురు మహిళలు అక్కడి వరదల్లో గల్లంతు కావడంతో జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. టీఆర్‌నగర్‌కు చెందిన షేక్ అఫ్రిన (30), సమీన (50), హసీన (28)తో పాటు వారి బంధువు, ఆర్మూర్‌కు చెందిన సోహెబ్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్హేడ్ తాలూకా దెగ్లూర్‌కు వెళ్లారు. ఆదివారం రాత్రి జగిత్యాల వైపు ఖాళీగా వస్తున్న ఓ కారు డ్రైవర్ వీరిని ఎక్కించుకుని టీఆర్‌నగర్‌కు బయల్దేరాడు.
30 కిలోమీటర్ల దూరం రాగానే ఓ వాగు ఉప్పొంగి ప్రవహించడంతో కారు అందులో చిక్కుకుంది. సోహెబ్, డ్రైవర్ ఎలాగో బయటపడి ఒడ్డుకు చేరారు. ముగ్గురు మహిళలు మాత్రం గల్లంతయ్యారు. అంతకుముందు సమీన తన కోడలుకు ఫోన్ చేసి ‘పిల్లలు జాగ్రత్త.. మేం వరదల్లో కొట్టుకుపోతున్నాం..’ అని సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఎంత ప్రయతి్నంచినా సమీన ఫోన్ పనిచేయలేదు. సోమవారం రాత్రి వరకూ వారి ఆచూకీ లభించలేదు.
చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి, మరొకరి గల్లంతు
కామారెడ్డి జిల్లాలో చేపల వేటకు వెళ్లిన ఒకరు నీట మునిగి చనిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామ శివారులో చెరువు అలుగు వరదలో సోమవారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన మోత్కూరు మండలం పాలడుగు గ్రామానికి చెందిన శివరాత్రి నవీన్ (25) గల్లంతైనట్లు గ్రామస్తులు తెలిపారు.