మేడిగడ్డకు డయాఫ్రమ్‌ వాల్‌! | Diaphragm wall for Medigadda | Sakshi
Sakshi News home page

మేడిగడ్డకు డయాఫ్రమ్‌ వాల్‌!

Apr 14 2026 2:48 AM | Updated on Apr 14 2026 2:48 AM

Diaphragm wall for Medigadda

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్‌ పునరుద్ధరణలో భాగంగా బరాజ్‌కు ఎగువ, దిగువ భాగంలో 40 మీటర్ల లోతుతో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మిస్తేనే బరాజ్‌ నాలుగు కాలాలపాటు మన్నికగా ఉంటుందని నిపుణులు నిర్ధారించారు. కాళేశ్వరం బరాజ్‌లకు షీట్‌పైల్స్‌తో ఫౌండేషన్‌ వేసేలా తొలుత డిజైన్లు తయారు చేయగా, సత్వరంగా నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో సికెంట్‌ పైల్స్‌కి మార్చారు. పునాదుల కింద రక్షణగా ఉండే సికెంట్‌ పైల్స్‌ ఏర్పాటులో లోపాలతో బరాజ్‌ల కింది నుంచి ఇసుక జారిపోయి మూడు బరాజ్‌లలోనూ కట్టిన తొలినాళ్లలోనే బుంగలు ఏర్పడ్డాయి. ప్రధానంగా  మేడిగడ్డలోని ఏడో బ్లాక్‌ కుంగిపోవడానికి ఇదే కారణమని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ తేల్చింది. మేడిగడ్డ బరాజ్‌కు శాశ్వత మరమ్మతుల్లో భాగంగా 40 మీటర్ల లోతుతో డయాఫ్రం వాల్‌ కడితే పునాదుల కింద ఒత్తిడి తగ్గి ఇసుక జారడం ఆగిపోతుందని నిపుణులు అభిప్రాయానికి వచ్చారు. 

నీటిపారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇటీవల జరిపిన సమీక్షలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. జియోఫిజికల్, జియో టెక్నికల్‌ పరీక్షల ఫలితాలు అందిన తర్వాత దీని నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దీనితోపాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో స్టిల్లింగ్‌ బేసిన్‌ (స్పిల్‌వే గేట్ల నుంచి విడుదలయ్యే వరదలోని శక్తిని నిరీ్వర్యం చేసే కాంక్రీట్‌ రక్షణ వ్యవస్థ)ను విస్తరించాలని నిర్ణయించారు. స్పిల్‌ వే నుంచి కిందికి దూకే వరద ఉధృతిని తట్టుకోవడంలో స్టిల్లింగ్‌ బేసిన్‌ విఫలం కావడంతో బరాజ్‌లు విఫలమైనట్టు ఇప్పటికే నిర్ధారించారు. దాంతో మూడు బరాజ్‌లలోనూ స్టిల్లింగ్‌ బేసిన్‌ను పెంచే పనులను వచ్చే అక్టోబరు నుంచి చేపట్టనున్నారు. 

డయాఫ్రం వాల్‌ పనులకు రూ.1500 కోట్లు 
మేడిగడ్డ బరాజ్‌ పునరుద్ధరణకే దాదాపు రూ.2500 కోట్ల దాకా వ్యయం కానుందని ప్రాథమిక అంచనా. బరాజ్‌ ఎగువ, దిగువ భాగంలో 40 మీటర్ల లోతుతో డయాఫ్రం వాల్‌ పనులకే రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్ల దాకా ఆయ్యే అవకాశాలున్నాయి. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులు చేయాలంటే ఎగువ, దిగువ భాగంలో కాఫర్‌ డ్యామ్‌ కట్టాలి. దీనికి మరో రూ.400 కోట్లు, కుంగిపోయిన ఏడో బ్లాక్‌ పునరుద్ధరణకు రూ.500 కోట్ల దాకా అయ్యే అవకాశాలున్నాయి. మేడిగడ్డలోని మూడు బ్లాకులు (6, 7, 8) దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మూడు బ్లాకులను శాశ్వతంగా తొలగించి, వాటి స్థానంలో కొత్త బ్లాకులు కట్టాలా..? లేక ఏడో బ్లాకు మాత్రమే తొలగించాలా? అనేది పరీక్షల ద్వారా తేలనుంది. బరాజ్‌ల పునరుద్ధరణ, మరమ్మతులకు ఖర్చు తొలుత ప్రభుత్వం భరించి తర్వాత కాంట్రాక్టర్ల నుంచి రాబట్టుకోవాలని భావిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement