అన్నదాతపై జీఎస్టీ పిడుగు

12 Percent GST On Micro-Irrigation Equipment Burdened By Farmers - Sakshi

సూక్ష్మసేద్యానికి 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే..

ఎకరానికి రూ.4 వేల భారం.. వెనక్కు తగ్గుతున్న అన్నదాతలు

ఆయిల్‌పాం సాగుకు ముందుకురాని వైనం

లక్షల దరఖాస్తులు పెండింగ్‌.. అధికారుల్లో టెన్షన్‌

సాక్షి, హైదరాబాద్‌: జీఎస్టీ భూతం సూక్ష్మసేద్యానికి విఘాతం కలిగిస్తోంది. వివిధ పంటల కోసం వ్యవసాయ భూముల్లో సూక్ష్మసేద్యం పరికరాలను ఏర్పాటు చేసుకోవాలంటే రైతులు 12 శాతం జీఎస్టీ భరించాల్సిరావడమే దీనికి కారణం. సూక్ష్మసేద్యం కోసం ఇప్పటికే లక్షలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే జీఎస్టీ సొమ్ము చెల్లించలేక రైతులు వెనుకడుగు వేస్తుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీ రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ అందిస్తోంది. ఎకరానికి సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే దాదాపు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. నాలుగు ఎకరాల్లో సూక్ష్మసేద్యం ఏర్పాటు చేసుకోవాలంటే రూ.లక్షకుపైగానే ఖర్చుకానుంది. కానీ, జీఎస్టీ భారాన్ని మాత్రం ఆ వర్గాల రైతులు భరించాల్సి వస్తోంది. అంటే ఎకరానికి రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు అన్నివర్గాలూ జీఎస్టీ కింద చెల్లించాల్సి వస్తోంది. నాలుగెకరాల్లో సూక్ష్మసేద్యం నెలకొల్పాలంటే రూ. 12–16 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీలకు వేల రూపాయలు ఖర్చయ్యే సూక్ష్మసేద్యం పరికరాలను ఉచితంగా బిగిస్తున్నా, జీఎస్టీని మాత్రం ఆయా రైతులు భరించాల్సి వస్తోంది. 

సూక్ష్మసేద్యంతో నీటి ఆదా...: సూక్ష్మసేద్యం ద్వారా అద్భుత ఫలితాలు వస్తున్నందున ఈ ఏడాది కూడా పెద్దమొత్తంలో రైతులకు సూక్ష్మసేద్యం పరికరాలు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. సూక్ష్మసేద్య పద్ధతి ద్వారా రాష్ట్రంలో 43 శాతం(25 టీఎంసీల) నీటిని పొదుపు చేశారు. వివిధ రకాల పంటల సాగును నూతన పద్ధతుల ద్వారా ప్రోత్సహించారు. ఈ పథకాన్ని పంటల సాగుకు వాడటంతో 33 శాతం విద్యుత్‌ అంటే 1,703 లక్షల యూనిట్లు ఆదా అయినట్లేనని న్యాబ్కాన్స్‌ సంస్థ చేసిన సర్వేలో తేలింది. మైక్రో ఇరిగేషన్‌ అమలు వల్ల 52 శాతం దిగుబడి పెరిగినట్లు గుర్తించారు. ఎందుకంటే మొక్కకు అవసరమైన నీరు నేరుగా సూక్ష్మసేద్యం పైపుల ద్వారా వెళుతుంది. మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లో అందించిన పరికరాల ద్వారా ఏడేళ్ల వరకు లబ్ధిపొందవచ్చు. అందుకే ఈ పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే గత లెక్కల ప్రకారం చూస్తే సూక్ష్మసేద్యంలో తెలంగాణ వెనుకబడింది. దేశవ్యాప్తంగా 2.30 కోట్ల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి వచ్చింది. కానీ, తెలంగాణలో కేవలం 5 లక్షల ఎకరాల్లోపే ఉందని అంచనా. 

ఆయిల్‌పాం సాగుకు దెబ్బ
ప్రస్తుతం 55 వేల ఎకరాలకే పరిమితమైన ఆయిల్‌పాం విస్తీర్ణాన్ని రానున్న రోజుల్లో 20 లక్షల ఎకరాలకుపైగా విస్తరించాలని రాష్ట్ర సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థ ఆయిల్‌ ఫెడ్‌ పరిధిలోనే ఉన్న ఆయిల్‌పాం సాగును ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించింది. రాష్ట్రంలో 10 ప్రైవేట్‌ కంపెనీలకు వివిధ జిల్లాల్లో ఆయిల్‌పాం సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత అప్పగించింది. 2022–23 వ్యవసాయ సీజన్‌లో రెండు లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ఉద్యానశాఖ నిర్దేశించింది. ఆయిల్‌పాం సాగులో సూక్ష్మసేద్యం పరికరాలే కీలకపాత్ర పోషిస్తాయి. కానీ, సూక్ష్మసేద్యం ఏర్పాటులో జీఎస్టీ భారం వల్ల అనేకచోట్ల రైతులు వెనకడుగు వేస్తున్నారు. సూక్ష్మసేద్యం మంజూరైన చోట్ల కూడా రైతులు జీఎస్టీ భారం భరించలేక, ఆ సొమ్ము చెల్లించకపోవడంతో అవి నిలిచిపోయాయి. రైతులకు భారం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే కంపెనీలైనా ఆ భారాన్ని భరించాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చదవండి: Indian Racing League: రెడీ టూ రైడ్‌.. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌కు సర్వం సిద్దం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top