కిడ్స్ కోసం సమ్మర్ స్లామ్
సాక్షి, చైన్నె: స్కూళ్లకు వేసవి సెలవులు ప్రారంభమైన వేళ, చిన్నారులను ఉత్సాహపరిచేందుకు ప్రముఖ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా రెండు సరికొత్త స్టోర్ ఫ్రంట్‌లను ప్రారంభించింది. కిడ్స్ సమ్మర్ స్లామ్, సమ్మర్ టాయ్స్ లిస్ట్ పేరుతో తీసుకొచ్చిన ఈ విభాగాల్లో ఆట వస్తువులు, అవుట్‌డోర్ గేర్, ఇతర సమ్మర్ ఎసెన్షియల్స్‌పై భారీ ఆఫర్లను ప్రకటించారు. ఆన్‌లైన్ వేదికగా పూర్తి స్థాయిలో పిల్లల ఆట వస్తువులను కొలువు దీర్చుతూ, ఈనెల 13 నుంచి 15 తేదీల వరకు భారీ తగ్గింపుతో పంపిణీకి చర్యలు తీసుకున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.
నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
వేలూరు: అనకట్టు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని డీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి, అనకట్టు అసెంబ్లీ డీఎంకే అభ్యర్థి నందకుమార్ అన్నారు. నియోజక వర్గం పరిధిలోని వేలూరు యూనియన్ పరిధిలోని తెల్లూరు, పులిమేడు, పుదూరు, ఊసూరు, అత్తివూరు గ్రామ పంచాయతీలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఊసూరు గ్రామ పంచాయతీలో ఆ పార్టీ కార్యకర్తలు క్రేన్‌తో పూలమాలను ఏర్పాటు చేసిన ఆయనకు మంగళ హారతులు పట్టి మాలను వేసి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా అనకట్టు నియోజకవర్గంలో అన్ని వసతులు కల్పించానని మరిన్ని అభివృద్ధి పనులు చేసేందుకు తనను ఆదరించాలని కోరారు. యూనియన్ కార్యదర్శి జ్ఞానశేఖరన్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రైలు ఢీకొని ఉద్యోగి మృతి
అన్నానగర్: తిరువొత్తియూర్ సమీపంలో తండ్రి లాగే కుమారుడు కూడా రైలు ఢీకొని మరణించిన ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. తిరువొత్తియూర్ సమీపంలో కాలడిపేటలోని తిలక్ నగర్‌కు చెందిన కిషోర్‌కుమార్ (23), తిరువళ్లూరులో రైల్వేలో ఎలక్ట్రీషియన్. శుక్రవారం సాయంత్రం విధులకు వెళ్తుండగా, అతను తిరువొత్తియూర్ వీఓసీ రైల్వేస్టేషన్ మధ్య ఉన్న రైలు పట్టాలను దాటేందుకు ప్రయత్నించాడు. ఆసమయంలో చైన్నె నుంచి హైదరాబాద్ వెళ్తున్న చర్లపల్లి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టడంతో కిషోర్‌కుమార్ మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే పోలీసులు జరిపిన దర్యాప్తులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. కిషోర్‌కుమార్ తండ్రి వేణుగోపాల్ కూడా రైల్వే ఉద్యోగి. ఆయన కూడా రైలు ఢీకొని మృతిచెందాడు. తండ్రి మృతిచెందడంతో కిషోర్‌కుమార్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చారు. తండ్రిలాగే కుమారుడు కూడా రైలు ప్రమాదంలో మరణించడం అతని కుటుంబాన్ని, ఆ ప్రాంత ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
జాలరి హత్య
తిరువొత్తియూరు: చైన్నె, కొత్తచాకలిపేటలో జాలరి దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి అతని ముగ్గురు స్నేహితులను అదుపులోకి పోలీసులు విచారణ జరుపుతున్నారు. తండయార్‌పేట వీఓసీ నగర్, 11వ కనెక్టింగ్ రోడ్డుకు చెందిన నరేష్‌కుమార్ (28) జాలరి. ఇతను శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో తన ఇంటి తలుపును బలంగా కొట్టాడు. తలుపు తెరిచిన అతని తండ్రి వెంకటేశన్, నరేష్‌కుమార్ మెడ, నడుము, ఛాతి భాగాల్లో కత్తిగాయాలతో రక్తపు గాయాలతో ఉండడంచూసి దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే అతన్ని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు, నరేష్‌కుమార్ అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. విషయం తెలిసి కొత్తచాకలిపేట పోలీసులు నరేష్‌కుమార్ స్నేహితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
లంచం కేసులో వీఏఓ అరెస్ట్
అన్నానగర్: లంచం తీసుకున్న కేసులో ఓ వీఏఓ అరెస్టయ్యాడు. విల్లుపురం జిల్లాలోని సెంజి సమీపంలో ఉన్న నడునెల్లిమలై గ్రామానికి చెందిన రైతు రంగనాథన్. తన అమ్మమ్మ ఇచ్చిన ఆస్తి పట్టా బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకోసం పడిపల్లం గ్రామ పరిపాలనాధికారి సింగారవడివేల్ రూ.5వేలు లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని రంగనాథన్, ఈ విషయమై ఏసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనల మేరకు శనివారం రసాయనాలు పూసిన నగదును రంగనాథన్ ఇస్తుండగా ఏసీబీ పోలీసులు సింగారవడివేల్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు.
రెట్టింపు లాభం పేరుతో మోసం
దంపతుల అరెస్ట్
అన్నానగర్: రెట్టింపు లాభాలు ఇస్తామని నమ్మించి క్లయింట్‌ను రూ.25 లక్షలు మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నెలోని విల్లివాక్కం దాడంగుప్పం ప్రాంతానికి చెందిన శివకుమార్ (49). ఇతను మద్రాస్ హైకోర్టులో న్యాయవాది. ఇతని స్నేహితుడు వెంకటాచలం టి. నగర్ ప్రాంతానికి చెందిన కోనేశ్వరన్ కంపెనీలో డబ్బు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం వస్తుంది‘ అని చెప్పాడు. ఇది నమ్మి శివకుమార్ 2022లో రూ.25 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఎలాంటి లాభం రాకపోవడంతో, డబ్బును తిరిగి ఇవ్వాలని శివకుమార్ అడిగాడు. కానీ, కోనేశ్వరన్ డబ్బు ఇవ్వకుండా మోసం చేసినట్లు తెలిసింది. శివకుమార్ ఫిర్యాదు ఆధారంగా, రాజమంగళం క్రైమ్ పోలీసులు కోనేశ్వరన్, భార్య శుభాను అరెస్టు చేసి జైలుకు తరలించారు.


