మహిళా కాంగ్రెస్‌కు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళా కాంగ్రెస్‌కు షాక్‌

Apr 12 2026 3:06 AM | Updated on Apr 12 2026 3:06 AM

● పార్టీకి హసీనా సయ్యద్‌ రాజీనామా

సాక్షి, చైన్నె: ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పార్టీ సీనియర్‌ నాయకురాలు హసీనా సయ్యద్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధిష్టానంపై, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగైపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంగా శనివారం హసీనా సయ్యద్‌మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ వేదికలపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పగా చెబుతుందని, కానీ ఆచరణలో తమిళనాడులో పోటీ చేస్తున్న 28 స్థానాల్లో కేవలం ఇద్దరు మహిళలకు (సుమారు 7%) మాత్రమే అవకాశం ఇచ్చిందని హసీనా మండిపడ్డారు. తనకు పట్టున్న కృష్ణగిరి నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరగా, స్క్రీనింగ్‌ కమిటీలో తన పేరు మొదటి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. అయితే, ఎంపీ చెల్లకుమార్‌ తన పలుకుబడిని ఉపయోగించి ఆ సీటును దక్కించుకున్నారని, దీని వెనుక నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహాలే కారణమని ఆరోపించారు.

నాయకత్వంపై ధ్వజం

ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తనకు మైలాడుతురై సీటు ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో పార్టీతో సంబంధం లేని వ్యక్తికి కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే, సెల్వపెరుంతొగై కుమ్మకై ్క అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఐదుగురు మహిళలకు అవకాశం ఇచ్చిందని,అయితే, మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్‌ మాత్రం అర్హత ఉన్న మహిళలను విస్మరించిందని విమర్శించారు. రాజకీయంగా అణచివేతకు గురవుతున్న మహిళల గొంతుకను వినిపించేందుకు తాను ’రివల్యూషనరీ పిజియన్స్‌’ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు హసీనా ప్రకటించారు. కాగా, ఎన్నికల సమయంలో కీలక మహిళా నేత ఇలా ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటం తమిళనాడు కాంగ్రెస్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Advertisement
 
Advertisement
Advertisement