సాక్షి, చైన్నె : తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ ఉమనాథ్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. బీజేపీకి చెందిన న్యాయవాది ఎ. మోహనన్‌దాస్ దాఖలు చేసిన పిటిషనన్‌లో ఉమానాథ్‌పై కీలక ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ, సీఎం వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఉమనాథ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తన పరిధిలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఆయన నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఇది ఎన్నికల పారదర్శకతను దెబ్బతీస్తుందని ఫిర్యాదు చేశారు. ఆయనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరారు.
కోర్టు విచారణ
ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుళ్ మురుగన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సదరు అధికారికి, ఎన్నికల విధులకు ఎటువంటి సంబంధం లేదని కోర్టుకు తెలిపారు.వాదనలు విన్న న్యాయమూర్తులు, ఈ ఆరోపణలపై పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్‌ను ఏప్రిల్ 17 లోగా దాఖలు చేయాలని ఎన్నికల కమిషనన్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు.


