తిరువళ్లూరు: అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే ఐదేళ్లలో డీఎంకే చేసిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం ఎడపాడి పళణిస్వామి అన్నారు. పట్టణంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను శనివారం నిర్వహించారు. సభకు తిరువళ్లూరు అన్నాడీఎంకే అభ్యర్థి రమణ, తిరుత్తణి హరి, గుమ్మిడిపూండి సుధాకర్, పొన్నేరి శిరునియం బలరామన్, మధురవాయల్ బెంజిమిన్, తిరువొత్తియూర్ కుప్పన్‌తో పాటు కూటమి అభ్యర్థులైన అంబత్తూరు కేఎన్ శేఖర్(పీఎంకే), ఆవడి అశ్విన్‌కుమార్ (బీజేపీ), పూందమల్లి టీఏ ఏలుమలై(ఏఎంఎంకే) మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఎడపాడి మాట్లాడుతూ ఐదేళ్లలో డీఎంకే నేతలు గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, మైన్స్, జలవనరులశాఖలో విచ్చలవిడిగా అవినీతి చేశారని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపిస్తామని ప్రకటించారు. దీంతో పాటు నిరాదరణకు గురైన అమ్మ క్యాంటీన్, అమ్మ మెడికల్ దుకాణాలు, తాళికి బంగారం, ఉచిత ల్యాప్‌టాప్‌లు సహా వేర్వేరు పథకాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకుంటున్న విజయ్ రాజకీయంపై విమర్శలు సంధించారు. కరూర్ సంఘటన తరువాత విజయ్ బయపడి 72 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి పోయారని గుర్తు చేసిన ఆయన, నటుడు విజయ్‌ను ఎంజీఆర్‌తో పోల్చడం సరికాదన్నారు.


