భద్రతపై డీజీపీ దృష్టి | - | Sakshi
Sakshi News home page

భద్రతపై డీజీపీ దృష్టి

Apr 11 2026 8:10 AM | Updated on Apr 11 2026 8:10 AM

● పోలీసు అధికారులతో సమీక్ష ● ఎన్నికల బరిలో 4,613 మంది ● చైన్నెలో 16 చోట్ల 419 మంది అభ్యర్థులు

సాక్షి, చైన్నె : నామినేషన్లకు సంబంధించిన అన్ని ప్రక్రియలు ముగిశాయి. ఎన్నికల రేసులో ఉన్న తుది అభ్యర్థుల జాబితా వెలువడింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఎన్నికలను ప్రశాంత పూరిత వాతావరణంలో విజయవంతం చేయడం లక్ష్యంగా డీజీపీ సందీప్‌ రాయ్‌ రాథోర్‌ దృష్టిపెట్టారు. శుక్రవారం అధికారులు, పోలీసుతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలలో 4,613 మంది పోటీలో ఉన్నట్టు ఎన్నికల కమిషన్‌ అధికారిక జాబితాను శుక్రవారం ఉదయం తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. ఇందులో చైన్నెలోని 16 నియోజకవర్గాలలో 619 మంది పోటీ చేస్తున్నారు. టీవీకే అధినేత విజయ్‌ పోటీ చేస్తున్న పెరంబూరులో అత్యధికంగా 47 మంది పోటీలో ఉన్నారు. వీరిలో పది మంది విజయ్‌, జోషఫ్‌ ఉండడం గమనార్హం. అలాగే, సీఎం స్టాలిన్‌ పోటీ చేస్తున్న కొళత్తూరులోనూ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగానే ఉండడం గమనార్హం.

భద్రతపై సమీక్ష

పోలీస్‌ ఉన్నతాధికారులతో డీజీపీ సందీప్‌రాయ్‌ రాథోర్‌ , చైన్నె పోలీస్‌ కమిషనర్‌ అరుణ్‌ సమావేశమయ్యారు. చైన్నెలో పోలింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నత స్థాయి పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు నగదు, బహుమతులు పంపిణీ చేయకుండా నిరోధించేందుకు నియోజకవర్గాల వారీగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ సర్వైలెన్‌న్స్‌ టీమ్‌ల తనిఖీలను ముమ్మరం చేస్తూ చర్యలు తీసుకున్నారు. అభ్యర్థులు ప్రచారంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు, ఒకవేళ ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడానికి వీలుగా ప్రచార కార్యక్రమాలను వీడియో రికార్డింగ్‌ చేసే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆదేశించారు. భద్రతా సమీక్షకు ముందు డీజీపీ సందీప్‌రాయ్‌రాథోర్‌ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్‌ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రశాంతంగా పోలింగ్‌ నిర్వహించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఇదిలాఉండగా, అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, అధికారులకు డీజీపీ కార్యాలయం ప్రత్యేక ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతాపరమైన చర్యలను ప్రణాళికబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రత్యేక కార్యాచరణతో విజయవంతం చేద్దామని సూచించారు. తమకు పట్టుబడ్డ నగదులో సరైన పత్రాలు చూపడంతో రూ.1.66 కోట్లు వెనక్కి ఇచ్చినట్టు చైన్నె ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement