సాక్షి, చైన్నె : పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలలో ఉపయోగించిన ఈవీఎంలు అన్నీ స్ట్రాంగ్ రూములకు చేరాయి. ఆ పరిసరాలను సీసీ కెమెరాల నిఘా నీడలోకి తీసుకొచ్చారు. పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాల్లో మొత్తం 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. మొత్తం ఓటింగ్ శాతం 91.23 శాతంగా నమోదైంది. దీంతో అధికార ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ కూటమిలో జోష్ పెరిగినట్టైంది. అదే సమయంలో పెద్ద ఎత్తున యువత ఈ ఎన్నికలలో ఓటు వేసిన దృష్ట్యా, అవి ఎవరి ఖాతాలో పడ్డాయో అనే చర్చ ఊపందుకుంది. ఇందుకుకారణం పుదుచ్చేరిలోనూ విజయ్ నేతృత్వంలోని టీవీకే పోటీలో ఉండడం గమనార్హం. ఓ యువ డాక్టర్ విజయ్ కోసం తాను రూ. 32 వేలు ఖర్చు పెట్టి సింగపూర్ నుంచి ఓటు వేయడానికి వచ్చినట్టు పేర్కొనడం గమనార్హం. యువతీ, యువకులు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం బట్టి చూస్తే, ప్రధాన పార్టీలైన డీఎంకే, కాంగ్రెస్ ఇండియా కూటమి, ఎన్‌ఆర్ కాంగ్రెస్, బీజేపీ ఎన్‌డీఏ కూటములలోని కొందరు అభ్యర్థులలో టెన్షన్ నెలకొంది.
స్ట్రాంగ్ రూములకు భద్రత
ఓటింగ్‌లో ఉపయోగించిన 1,099 ఈవీఎంలు, వీవీ ప్యాడ్, కంట్రోల్ పానల్స్‌ను ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాల నుంచి పుదుచ్చేరిలోని ఠాగూర్ ఆర్ట్స్ కాలేజీ, మోతీలాల్ నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీకి చేర్చారు. ఇక్కడి స్ట్రాంగ్ రూములలో నియోజకవర్గాల వారీగా వాటిని ఉంచారు. ఈవీఎంలు అన్నీ పూర్తిగా నిఘా నీడలో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ పరిసరాలలో మూడు అంచెలతో కూడిన భద్రతను కల్పించారు.
రాజకీయ పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీల్


