సాక్షి,చైన్నె: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచార పర్వం వేగం పుంజుకుంటున్నది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్ కోసం ప్రధాన పార్టీల అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 15న కన్యాకుమారి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన వడస్సేరి నుంచి రోడ్‌షో నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థులు ఎం.ఆర్. గాంధీ, విజయధరణి, తామరై సోమన్, అన్నాడీఎంకే అభ్యర్థి దళవాయి సుందరానికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ప్రధానమంత్రి పర్యటన దష్ట్యా నాగర్‌కోయిల్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
రాహుల్‌గాంధీ ప్రచార షెడ్యూల్
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఏప్రిల్ 12న తమిళనాడుకు రానున్నారు. శ్రీపెరంబుదూర్‌లో తొలుత తన తండ్రి రాజీవ్‌గాంధీ స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించి, అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి సెల్వపెరుంతగై తరఫున ప్రచారం ప్రారంభిస్తారు. తూత్తుకుడిలో జరగనున్న భారీ బహిరంగ సభలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్, రాహుల్‌గాంధీ ఒకే వేదికపై ప్రసంగించనున్నారు. ఆ తర్వాత పర్యటనగా ఏప్రిల్ 15, 16 తేదీల్లో రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ కూడా కోయంబత్తూరు, సేలం, మదురై ప్రాంతాల్లో ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.


