సాక్షి, చైన్నె : న్యూఢిల్లీ నుంచి వచ్చినా, గుజరాత్ నుంచి వచ్చినా లేదా సేలం నుంచి వచ్చినా ఇక్కడ గెలిచేది మాత్రం డీఎంకేయే అని మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ అన్నారు. కోయంబత్తూరు జిల్లా మెట్టుపాళయంలోని శుక్ర వారం డీఎంకే నేతృత్వంలో కూటమి నేతల సమావేశం జరిగింది. సమావేశానికి డీఎంకే పశ్చిమ మండల ఇన్‌న్‌చార్జ్ , మాజీ మంత్రి వి.సెంథిల్‌బాలాజీతోపాటు మెట్టుపాళయం నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి కవిత పాల్గొన్నారు. సెంథిల్ బాలాజీ మాట్లాడుతూ, ఢిల్లీ, గుజరాత్‌ల నుంచే కాదు, సేలం నుంచి ఎందరు వచ్చినా తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. మెట్టుపాళయం నియోజకవర్గం నుంచి డీఎంకే తరఫున పోటీ చేస్తున్న కవితను 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిస్తాన్నారు. కోయంబత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ డీఎంకే క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన ఈసందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.


