తమిళసినిమా: సినిమాలో ఏదైనా జరగవచ్చు. ఎవరి ప్రయత్నం వారిది. అందులో విజయం సాధించిన వారు ఉన్నారు. దాని కోసం పోరాడుతున్న వారు ఉన్నారు. ఇక నటుడు అజిత్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ స్టార్ నటుడు 63 చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. ఈయన ఇటీవల వరకూ నటనపైనే దృష్టి సారించారు. అలాంటిది ఇటీవల కార్ రేస్ పోటీల్లో పాల్గొంటూ ప్రపంచ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. ఇకపోతే ఈయన చివరిగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. త్రిష నాయకిగా నటించిన ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రం కమర్శియల్‌గా మంచి విజయాన్ని సాధించింది. అయితే తదుపరి చిత్రం కోసం అజిత్ చాలా గ్యాప్ తీసుకున్నారు. ఇందుకు కారణం ఆయన కార్ రేస్ పోటీలపై ప్రత్యేకంగా దృష్టి సారించడమే. కాగా అజిత్ నటించనున్న తదుపరి చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్‌నే దర్శకత్వం వహించనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రాన్ని నిర్మించేది ఎదరన్నదే ప్రశ్నార్థకంగా మారింది. అజిత్ హీరోగా టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఇంతకు ముందు విశ్వాసం చిత్రాన్ని నిర్మించిన సత్య జ్యోతి ఫిలింస్, అదే విధంగా అజిత్‌తో ఎలాగైనా చిత్రాన్ని చేయాలని చాలా కాలంగా ఆశిస్తున్న వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ లైన్‌లో ఉన్నాయని సమాచారం. అయితే అజిత్ పారితోషికం, చిత్ర బడ్జట్ వంటి విషయాల్లోనే ఈ సంస్ధలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీంతో నటుడు అజిత్‌నే నిర్మాతగా రంగంలోకి దిగడానికి సిద్దం అవుతున్నట్లు కోలీవుడ్‌లో తాజాగా వైరల్ అవుతున్న ప్రచారం. ఈయన ఇప్పుటికే తాను కారు రేసుల్లో పాల్గొంటున్న దృశ్యాలతో ఒక లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా తదుపరి తాను హీరోగా నటించే చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలవడాల్సి ఉందన్నది గమనార్హం.
నటుడు అజిత్


