సాక్షి, చైన్నె : ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ చైన్నె చాప్టర్ నేతృత్వంలో 2026–27 సంవత్సరానికి గాన చైర్‌పర్సన్ గా ఎంపికై న డాక్టర్ అముల్యా రావు నేతృత్వంలో ‘ది బిజినెస్ ఆఫ్ ఫ్యాషన్’ అనే వినూత్న కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై ప్రముఖ భారతీయ లగ్జరీ ఫ్యాషన్ డిజైనర్ జయంతి రెడ్డి తన అనుభవాలను పంచుకున్నారు. మారుతున్న పోకడలు, బ్రాండ్ బిల్డింగ్, అంతర్జాతీయ స్థాయిలో భారతీయ ఫ్యాషన్ భవిష్యత్తు గురించి ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. జయంతి రెడ్డి తన ప్రసంగంలో సంప్రదాయ చేనేత కళను ఆధునిక హంగులతో మేళవించి లగ్జరీ ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్ర , ప్రయాణంలోని ఒడిదుడుకులను వివరించారు. నమ్మకం ఉంటే, ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. చైర్‌పర్సన్ డాక్టర్ అముల్య రావు మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడమే ఈ ఏడాది తమ లక్ష్యమని, ‘ఇన్‌స్పైర్, ఇన్నోవేట్, ఇంపాక్ట్’ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు ఆమె తెలిపారు. జూలై 24, 25 తేదీలలో నయనం పేరుతో ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ బజార్‌ను నిర్వహించనుమన్నారు. ఐఐటీ మద్రాస్, అన్నా యూనివర్సిటీ వంటి సంస్థలతో కలిసి తయారీ రంగం, ఈవీ టెక్నాలజీలో మహిళలకు శిక్షణ ఇవ్వనున్నామని ప్రకటించారు.


