డీఎంకే గెలుపునకు అధికారుల యత్నం | - | Sakshi
Sakshi News home page

డీఎంకే గెలుపునకు అధికారుల యత్నం

Apr 10 2026 9:57 AM | Updated on Apr 10 2026 9:57 AM

● నైనార్‌ నాగేంద్రన్‌ ఆరోపణ

సాక్షి, చైన్నె: డీఎంకేను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు పోలీసు, రెవెన్యూ యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌నాగేంద్రన్‌ ఆరోపించారు. తిరునెల్వేలి నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి గణేష్‌ రాజాకు మద్దతుగా గురువారం జరిగిన ప్రచారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ చేసిన వ్యాఖ్యలు అధికార వర్గాలలో చర్చకు దారి తీశాయి. అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని డీఎంకే దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. తమిళనాడులో రెవెన్యూ, పోలీసు శాఖలు డీఎంకేకు అనుకూలంగా పనిచేస్తున్నాయని వ్యాఖ్యలు చేశారు. రెవెన్యూ, పోలీసు శాఖలు కుమ్మకై ్క డీఎంకేను గెలిపించడానికి విస్తృతంగా చర్యలు, ప్రయత్నాలు చేపట్టి ఉన్నాయన్నారు. ముఖ్యంగా కన్యాకుమారి జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు అధికార పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు వారి పప్పులు ఉడకనివ్వరని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్రంలో కనిపిస్తున్న రహదారులు, ఫ్లైఓవర్లు వంటి మౌలిక సదుపాయాలన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించబడ్డవేనని వివరించారు. గత ఐదేళ్లలో తమిళనాడు ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేదని, ఒకవేళ అభివృద్ధి ఉంటే అది కేవలం గంజాయి విక్రయాల్లో మాత్రమే కనిపిస్తోందని ఘాటుగా విమర్శించారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్‌ విసిరారు. కాగా, తిరునల్వేలిలో విజయ్‌ ప్రచారానికి భారీగా జనం తరలిరావడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు.. తాను ఆ దృశ్యాలను చూడలేదని దాటవేశారు.డీఎంకేకు సొంతంగా పథకాలు లేవని, అన్నాడీఎంకే ప్రవేశపెట్టిన పథకాలను కాపీ కొడుతూ కాలం నెట్టుకు వచ్చిందన్నారు.కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడ ఉందో కూడా ఎవరికీ తెలియదని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement