సాక్షి, చైన్నె: మదురై తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే వ్యవహారంలో కోర్టు ధిక్కరణకు సంబంధించిన దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సింగిల్ జడ్జి విచాకరణకు స్టే విధిస్తూ జస్టిస్ సతీష్ కుమార్, జస్టిస్ జ్యోతిరామన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
కేసు నేపథ్యం ఇదీ..
తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న స్తంభంపై దీపం వెలిగించాలని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులు అమలు కాలేదని పేర్కొంటూ మధురై జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ , ఆలయ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసులు దాఖలయ్యాయి. ఈ కేసును విచారిస్తున్న సింగిల్ జడ్జి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఉత్తర్వులు జారీ చేశారు.
ధర్మాసనం అభ్యంతరాలు
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చవద్దని సూచించారు. ఇది ఒక చిన్న సమస్య, అయితే, దీనిని అనవసరంగా పెద్దది చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అప్పీల్ పిటిషన్‌పై డివిజన్ బెంచ్ ఇప్పటికే స్టే విధించిన తర్వాత, అదే అంశంపై సింగిల్ జడ్జి విచారణ కొనసాగించడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. దర్గా తరపు న్యాయవాదులు వాదిస్తూ, సదరు సింగిల్ జడ్జి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని నమూనా దీపస్తంభంపై దీపం వెలిగించారని, కాబట్టి ఆయన ఈ కేసును విచారించడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కోర్టు తీర్పు
కోర్టులో గధమాయించే విధంగా వ్యవహరిస్తూ న్యాయస్థానాన్ని భయపెట్టేలా ఎవ్వరూ మాట్లాడకూడదంటూ.. ఈ కేసులో చట్టప్రకారం మాత్రమే నిర్ణయం తీసుకోబడుతుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ వివాదానికి సంబంధించి సింగిల్ జడ్జి జారీ చేసిన అన్ని ఉత్తర్వులపై తాత్కాలిక స్టే విధిస్తూ, తదుపరి విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేశారు.


