తమిళసినిమా: ప్రేమ నేపథ్యంలో రూపొందే కొత్తదనంతో కూడిన చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటి ఆధునిక యువత ప్రేమ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న తాజా చిత్రం వైఫ్. నటుడు ఆర్జే విజయ్, అంజలి నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఒలింపియా మూవీస్ పతాకంపై ఎస్.అంబేద్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఆర్.హేమనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటుడు మైత్రేయన్, రెడిస్ కింగ్స్ లీ, అభిషేక్ జోసప్, విజయ్ బాబు, కల్యాణి నటరాజన్, లల్లు, ఖదీర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది ఈ తరం యువత పెళ్ళికి ముందు, ఆ తరువాత 6పేమ గురించి చర్చించే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ప్రేక్షకులను అలరించే రొమాంటిక్ డ్రామా కథా చిత్రంగా వైఫ్ ఉంటుందని తెలిపారు. కాగా ఈ చిత్రంలోని సారల్ అనే మెలోడి రొమాంటిక్ పాటను మంగళవారం విడుదల చేసినట్లు చెప్పారు. ఈ పాటకు జెన్ మార్టిన్ సంగీతాన్ని అందించి గాయని సుబ్బలక్ష్మితో కలిసి పాడినట్లు చెప్పారు. ఈ పాటకు సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని, చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.


