పెట్టుబడిదారుల
ప్రయోజనాలే లక్ష్యం
సాక్షి, చైన్నె: పెట్టుబడిదారుల ప్రయోజనాలే లక్ష్యంగా కొత్త ఒరవొడితో ముందుకెళ్తున్నామని ఐసీఎల్ ఫిన్‌కార్ప్ ఎండీ అనిల్‌కుమార్ తెలిపారు. మంగళవారం చైన్నెలో జరిగిన సమావేశంలో ఏప్రిల్ 10 నుంచి ప్రారంభం కానున్న ఐసీఎల్ ఫిన్‌కార్ప్ ఏసీడీ ఇష్యూ గురించి వివరించారు.ఇది సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్–కన్వర్టిబుల్ డిబెంచర్ల పబ్లిక్ ఇష్యూగా ఉంటుందని, పెట్టుబడిదారులకు గరిష్టంగా 12.25 శాతం వరకు వార్షిక రాబడిని అందిస్తారని ప్రకటించారు. ఏప్రిల్ 24న ఈ ఇష్యూ ముగుస్తుందని అన్నారు.
గృహాల్లో చైన్నె నంబర్ ఒన్
సాక్షి, చైన్నె: చైన్నె రియల్ ఎస్టేట్ రంగం అద్భుత వృద్ధిని నమోదుచేసింది. గృహ విక్రయాల్లో అగ్రస్థానంలో, ఆఫీసు లీజింగ్‌లోనూ సత్తాను చాటింది. ఈ మేరకు మంగళవారం నైట్ ఫ్రాంక్ ఇండియా సర్వే ఫలితాలను స్థానికంగా ప్రకటించారు. తాజాగా విడుదల చేసిన ‘ఇండియా రియల్ ఎస్టేట్ క్యూ1 2026’ నివేదిక ప్రకారం, చైన్నె రియల్ ఎస్టేట్ మార్కెట్ అద్భుతమైన వృద్ధిని కనబరిచింది. ఈవిషయంగా నైట్ ఫ్రాంక్ ఇండియా నేషనల్ డైరెక్టర్ జోసెఫ్ తిలక్ మాట్లాడుతూ, దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే గృహ విక్రయాల వృద్ధిలో చైన్నె అగ్రస్థానంలో నిలిచిందన్నారు. గత ఏడాదితో పోల్చితే 9 శాతం వృద్ధితో 4,763 యూనిట్లకు చేరినట్టు ప్రకటించారు. మధ్య తరగతి విభాగంలో రూ.50 లక్షల నుంచి రూ.కోటిలోపు ఇళ్ల విక్రయాలు 19 శాతం పెరిగాయని తెలిపారు.
హోటల్ ఉద్యోగి హత్య
అన్నానగర్: చైన్నె, కొళత్తూరు సమీపంలోని పెరవళ్లూరులోని జీకేఎం కాలనీ, 20వ వీధికి చెందిన రమేష్ (57). ఇతను ఒక ప్రైవేటు రెస్టారెంట్‌లో వెయిటర్. గత 25 ఏళ్లుగా మనస్పర్థల కారణంగా భార్యకు దూరంగా ఒంటరిగా ఉంటున్నాడు. ఇతని ఇంటికి దగ్గరలో నివసించే రమేష్ తల్లి భా నుమతి రమేష్‌కు ఫోన్ చేసింది. కాని అతను స్పందించలేదు. మంగళవారం ఉదయం 10 గంటల వరకు రమేష్ ఇంటి నుంచి బయటకు రాలేదు. అ నుమానం వచ్చిన భానుమతి చూడడానికి రమేష్ ఇంటి తలుపు తెరచి లోపలికి వెళ్లింది. ఇంట్లో కత్తిపోట్లతో రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న రమేష్‌ను చూసి ఆమె దిగ్భ్రాంతికి గురైంది. వెంట నే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచా రం అందుకున్న పెరవళ్లూరు పోలీసులు రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పో లీసుల ప్రాథమిక విచారణలో రమేష్ సోమవా రం రాత్రి తన ఇంట్లో స్నేహితులతో కలసి మద్యం తాగాడని, స్నేహితుల మధ్య జరిగిన గొడవ రమేష్‌ను అతని స్నేహితులు కత్తితో పొడిచి చంపి పారిపోయారు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రెండు వారాలు
అగ్గిపెట్టెల ఫ్యాక్టరీల మూత
కొరుక్కుపేట: పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరగడంతో 5 లక్షల కార్మికుల కుటుంబాల జీవనోపాధి ప్రశ్నార్థకమైంది. అగ్గిపెట్టెల కర్మాగారాలను ఈనెల 12 తేదీ నుంచి మూసివేత అమల్లోకి వస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అగ్గిపెట్టెల తయారీకి అవసరమైన ముడిపదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా ఈనెల 12 నుంచి రెండు వారాల పాటు అగ్గిపెట్టెల కర్మాగారాలను మూసివేయాలని తయారీదారులు నిర్ణయించారు. దీంతో 5 లక్షల మంది కార్మికుల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది.
విమానంలో ప్రయాణికుడి మృతి
తిరువొత్తియూరు: మారిషస్ నుంచి చైన్నెకి వెళుతున్న విమానంలో గుండెపోటుతో ఓ ప్రయాణికుడు మృతిచెందాడు. మారిషస్ నుంచి చైన్నెకి 186 మంది ప్రయాణికులతో ఒక విమానం బయలుదేరింది. ఈ విమానంలో బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న కృష్ణ (60) అనే వ్యక్తి చైన్నెలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం భార్యతో కలిసి వస్తున్నారు. విమానం మంగళవారం తెల్లవారుజామున వస్తుండగా మార్గమధ్యలో కృష్ణకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. వెంటనే విమాన సిబ్బంది పైలట్‌కు సమాచారం అందించారు. 20 నిమిషాల ముందుగానే ఉదయం 6 గంటలకు విమానం చైన్నెలో ల్యాండ్ అయ్యింది. వెంటనే విమానంలోకి వచ్చిన వైద్యులు ప్రయాణికుడిని పరీక్షించి అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. విమానాశ్రయ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాంబరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తరవాత విమానాన్ని శుభ్రం చేసిన కారణంగా ఉదయం 8.10 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఉదయం 9.20 గంటలకు మారిషస్ బయలుదేరి వెళ్లింది.
ప్రైవేట్ గోడౌన్‌లో
భారీ అగ్నిప్రమాదం
తిరువొత్తియూరు: చైన్నె టి.నగర్‌లో ప్రైవేటు గోడౌన్‌లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. రూ.40 లక్షల విలువైన కూరగాయలు, కిరాణ సామగ్రి దగ్ధమయ్యాయి. చైన్నె టి.నగర్ త్యాగరాయ నగర్ మూసా వీధిలో ఆన్‌లైన్‌లో నిత్యావసర వస్తువులు విక్రయించే సంస్థకు చెందిన గోదాం ఉంది. ఈ గోదాంలో కూరగాయాలు, కిరాణా సామగ్రి వంటి నిత్యావసర వస్తువులు అమ్మకం కోసం ఉంచారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఈ గోదాం నుండి అకస్మాతుగా మంటలు వ్యాపించాయి. అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అప్పటికే గోదాంలో ఉన్న కూరగాయలు, కిరాణ సామగ్రి వంటి నిత్యావసర వస్తువులు మంటల్లో కాలి బూడిదయ్యాయి.


