
ఆ సమయంలో రైలు బోగీ అద్దాలు ధ్వంసమయ్యాయి.
వేలూరు: చైన్నె నుంచి కర్ణాటక రాష్ట్రం మైసూరుకు వందేభారత్ రైలును గత నవంబర్ 11వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 5. 50 గంటల సమయంలో చైన్నె నుంచి మైసూరుకు వందే భారత్ రైలు బయలు దేరింది. ఉదయం 8 గంటల సమయంలో తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని పుదూరు వద్ద వెళ్తున్న రైలుపై గుర్తు తెలియని వ్యక్తి రాళ్లు రువ్వి అక్కడ నుంచి పరారయ్యాడు.
ఆ సమయంలో రైలు బోగీ అద్దాలు ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు. ఈ రైలుకు కాట్పాడి అనంతరం బెంగళూరులో మాత్రమే స్టాపింగ్ ఉంది. దీంతో బెంగళూరులోని రైల్వే పోలీసులకు ఇంజన్ డ్రైవర్ ఫిర్యాదు చేశాడు. బెంగళూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి జోలార్‌పేట రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
తర్వాత వాణియంబాడి సమీపంలోని తిరుమంజారోడ్డుకు చెందిన కుపేంద్రన్(21)పై అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో రైలుపై రాయి విసిరింది అతడేనని రుజువు కావడంతో అరెస్ట్ చేశారు. తాను మద్యం మత్తులో ఉండటంతోనే రైలుపై రాయి విసిరినట్లు వెల్లడించాడు.కాగా కుపేంద్రన్‌పై వాణియంబాడి పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికై పలు చోరీ కేసులున్నట్లు తెలిసింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.