తెలుగు లోగిళ్లలో.. శోభకృత్‌ సంబరాలు

 కన్యకాపరమేశ్వరిలో పుష్పయాగం 
 - Sakshi

సాక్షి,చైన్నె : చైన్నె నగరంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు ఉగాది వేడుకలను బుధవారం పెద్దఎత్తున నిర్వహించారు. వివిధ సంఘాల కూడా తెలుగు సంస్కృతి, సంప్రదాయం ఉట్టి పడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాయి.

టీబీఎం నేతృత్వంలో..: తెలుగు బ్రాహ్మణ మహాసభ (టీబీఎం) అధ్యక్షులు కల్య రఘుకుమార్‌ అధ్యక్షతన టి.నగర్‌లోని ఇన్ఫోసిస్‌ హాలు వేదికగా ఉగాది వేడుకలు చేపట్టారు. ముఖ్యఅతిథిగా సీబీఐ–చైన్నె డీఎస్పీ టి. సత్యమూర్తి పాల్గొని.. వేదపండితులు బ్రహ్మశ్రీ సీతారామ శర్మ, ఫ్లూట్‌ కళాకారులు టి. శ్రీధర్‌, అడ్వకేట్‌ కె.ప్రదీప్‌కు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు.

శ్రీ ఆంధ్ర కళాస్రవంతి నేతృత్వంలో..: శ్రీ ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షులు జేఎం నాయుడు అధ్యక్షతన కొరట్టూరు అగ్రహారంలోని కోదండ రామాలయం ఆవరణలో వైభవంగా వేడుకలు నిర్వహించారు. దక్షిణ భారత రిపబ్లిక్‌ ఆఫ్‌ సీషెల్స్‌ కాన్సుల్‌ జనరల్‌ ఎమ్‌. శేషసాయితోపాటు గుల్లపల్లి సుజాత , డాక్టర్‌ విస్తాలి శంకరరావు, డాక్టర్‌ ముత్తు ఎతిరాజులు వంటి తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తదితర దాతల సౌజన్యంతో విద్యార్థులు, అంధులకు స్కాలర్‌షిప్‌లను అందజేశారు.

ఆస్కాలో..: ఆంధ్రాసోషల్‌ అండ్‌ కల్చరల్‌ అసోసియేషన్‌(ఆస్కా) అధ్యక్షుడు కె. సుబ్బారెడ్డి నేతృత్వంలో ఆస్కా ఆవరణలో వేడుకలు జరిగాయి. ఐఏఎస్‌ అధికారి గోవింద్‌ రావు, సినీ నటుడు మానస్‌ హాజరయ్యారు. నేపథ్య గాయకులు రాము, శ్రీవర్థిని తమన్‌ల సంగీత విభావరి అలరించింది. ఆస్కా సంయుక్త కార్యదర్శి జేకే రెడ్డి, తదితర సభ్యులు పెద్ద సంఖ్యలో కుటుంబ సమేతంగా హాజరయ్యారు.

ఆంజనేయ నగర్‌లో..: ఉత్తర చైన్నెలోని తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్న ఆంజనేయ నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పేద చిన్నారులకు ,పేద మహిళలకు , కార్మికులకు సహాయకాలు అందించారు .నార్త్‌ చైన్నె జిల్లా కార్యదర్శి ఆర్‌ తిరుపాల్‌, ఆర్‌ కె గోపాల్‌ సారథ్యంలో ముఖ్యఅతిథిగా నార్‌ చైన్నె కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు ఎంఎస్‌ ద్రవ్యం పాల్గొని సహయకాలు అందించారు.

పెరంబూరులో..:తమిళనాడు తెలుగు సాంస్కృతిక సంఘంలో అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షతన స్థానిక పెరంబూరులో ఉగాది వేడుకలు జరుపుకున్నారు. అతిథులుగా ఆలిండియా రేడియో –చైన్నె పూర్వనిర్దేశకులు ఎస్‌. వేణుగోపాల్‌రెడ్డి, పారిశ్రామికవేత్తలు సురేష్‌ కుమార్‌రెడ్డి, నర్రావుల వెంకట రమణ పాల్గొని ఉగాది విశిష్టతను తెలిపారు.

ఉగాది బహుమతులు ప్రదానం: పాత చాకలి పేటలోని దేవాంగ పెండ్లిసమాజం ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు. పండుగ రోజున విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

వైశ్య సంఘంలో ఆధ్వర్వంలో..: దక్షిణ ఇండియా వైశ్య సంఘంలో అధ్యక్షుడు అజంతా డాక్టర్‌ కె. శంకరరావు అధ్యక్షతన ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సంయుక్త కార్యదర్శులు ఎం. నర్సింహులు, పి. అశోక్‌కుమార్‌, కోశాధికారి పి. రమేష్‌తో పాటు సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

టీటీడీ ఆధ్వర్యంలో..: టీ నగర్‌లోని టీటీడీ సమాచార కేంద్రం శ్రీవారి ఆలయంలో ఉగాది వేడుకలు పెద్దఎత్తున చేపట్టారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక సలహామండలి చైర్మన్‌ ఏజే శేఖర్‌రెడ్డి నేతృత్వంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే జీఎన్‌ చెట్టి రోడ్డులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరారు.

పుష్పయాగం..: ఉగాది సందర్భంగా శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆలయంలో పుష్పయాగం కనుల పండువగా సాగింది. అర్చకులు భాస్కర్‌ పంతులు నేతృత్వంలో సాయంత్రం ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించి, పలు రకాల పుష్పాలతో అమ్మవారిని అలకరించారు. అలాగే, ప్యారిస్‌లోని సాయిబాబా ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయిబాబాకు ప్రత్యేక అలకంరణలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

వేలూరు, తిరువణ్ణామలై ..

తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని వేలూరు తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలో ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అలాగే తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వాలాజ ధన్వంతరి ఆరోగ్య పీఠంలో ఉదయం 6 గంటలకే ధన్వంత్రి స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top