
గూడూరు రాధాకృష్ణ
సాక్షి చైన్నె: చైన్నె విమానాశ్రయ సలహామండలి (చైన్నె ఎయిర్ పోర్ట్ అడ్వైజరీ కమిటీ) సభ్యుడిగా తెలుగు ప్రముఖుడు, పారిశ్రామిక వేత్త గూడూరు రాధాకృష్ణను కేంద్రప్రభుత్వం నామినేట్ చేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఇమేజ్ గ్రూపు సంస్థల అధినేతగా రాధాకృష్ణ పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పలువురు తెలుగువారికి, తెలుగు సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు ఆయన పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్టడుగు వర్గాల జీవనోపాధి కోసం కృషి చేస్తున్నారు. ఇది వరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక సలహామండలి సభ్యుడిగా, ఉపాధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. అలాగే, నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యునిగా, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స్ మిషన్ (ఎన్సీఎల్‌ఎం) సభ్యునిగా, కేంద్రప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ అలెవియేషన్ సభ్యుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇదిలా ఉండగా, చైన్నె విమానాశ్రయంలో రూ.2,400 కోట్ల వ్యయంతో 2.36 లక్షల చ.మీ. విస్తీర్ణంలో కొత్తగా నిర్మించిన టెన్మినల్‌ను ఈనెల 27వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానాశ్రయ సలహా కమిటీ సభ్యుడిగా రాధాకృష్ణ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కమిటీలో విమానయాన శాఖ నామినేట్ చేసిన సభ్యులతో పాటు ఎంపీ, ఎమ్మెల్యే, చైన్నె ఎయిర్పోర్ట్ అథారిటీ సర్వాధికారి, కస్టమ్స్ కమిషనర్, జిల్లా కలెక్టర్, నగర పోలీసు కమిషనర్ తదితరులు కూడా సభ్యులుగా ఉంటారు. విమానాశ్రయంలో ప్రయాణికుల సేవలను మెరుగుపరిచేందుకు అవసరమైన సూచలను ఈ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేస్తుంది. ఈ కమిటీ సభ్యుడిగా తెలుగు ప్రముఖుడు రాధాకృష్ణ నియమితులు కావడంపై పలువురు ప్రముఖులు శనివారం హర్షం వ్యక్తం చేశారు.
మెరుగైన సదుపాయాలే లక్ష్యం
విమానాశ్రయ ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే తన లక్ష్యమని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పగించిన బాధ్యతకు పూర్తి న్యాయం చేస్తానన్నారు. కొత్త టెర్మినల్లోఅత్యాధునిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని వివరించారు. దీనిపై ఇప్పటికే ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.