
పట్టుచీరల వ్యాపారి బలవన్మరణం
ధర్మవరం అర్బన్: పట్టుచీరల వ్యాపారి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెడు అలవాట్లు, క్రికెట్ బెట్టింగ్ కోసం చేసిన అప్పులు పెరిగిపోవడం.. వ్యసనాలు మానుకోవాలని ప్రాధేయపడినా మారలేదని భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన బండి జగదీష్ (30)కు నేసేపేటకు చెందిన అంజలితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. జగదీష్ పట్టుచీరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఏడాది కిందటి నుంచి చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో క్రికెట్ బెట్టింగ్‌లో సంపాదించిన సొమ్ముతో పాటు బయట అప్పులు చేసి మరీ పెట్టి.. నష్టపోయాడు. పద్ధతి తప్పిన భర్తను తిరిగి మార్చుకోవడానికి భార్య ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. మందలించినా, ప్రాధేయపడినా అతనిలో మార్పు కనిపించలేదు. చేసేదిలేక ఆమె నాలుగు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికీ జగదీష్ వ్యసనాలను వదులుకోలేదు. భార్య తిరిగి కాపురానికి రాకపోవడం, వ్యసనాలను వీడలేకపోవడంతో మనస్తాపం చెంది గురువారం ఇంట్లోని బాత్రూమ్‌లోకి వెళ్లి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే జగదీష్ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
చెడు అలవాట్లు, బెట్టింగ్‌తో విపరీతంగా అప్పులు