
చంద్రబాబు.. పెద్ద మోసకారి
స్వలాభం కోసమే బాబు పాలన
సాక్షి, పుట్టపర్తి/ పుట్టపర్తి: ‘ప్రతి ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం చంద్రబాబు నాయుడుకు అలవాటే. ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకుని గెలవడం.. ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈసారి ప్రతిపక్ష పాత్రలో వైఎస్సార్‌సీపీ పోరాటాలు చేస్తోన్న క్రమంలోనే ఒకట్రెండు పథకాలను అరకొరగా ఇచ్చారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీశ్‌రెడ్డి అన్నారు. పుట్టపర్తిలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నియోజకవర్గ స్థాయిలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో భాగంగా ‘రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో’ క్యూఆర్ కోడ్ విడుదల చేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను క్యూఆర్ కోడ్ ద్వారా పరిశీలించాలని.. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వేంపల్లి సతీశ్‌రెడ్డి అన్నారు. గడిచిన ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీ అమలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు.. ఓ మోసగాడు.. మాయలోడు అనే విషయం ప్రజలందరికీ అర్థమైందన్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి నెలా ఏదో ఒక పథకం రూపంలో ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ అయ్యేదని గుర్తు చేశారు. పేదలకు చేదోడు – వాదోడుగా వైఎస్ జగన్ నిలిచారని, నేడు చంద్రబాబు కేవలం తన కార్యకర్తలకు మాత్రమే సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా మాత్రమే తనకు ఇదివరకు పుట్టపర్తి తెలుసన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో పంటలు దున్నేయడం, చెట్లను నరికేయడం వంటి సంప్రదాయాలను ఇక్కడ చూడాల్సి రావటం దౌర్భాగ్యమన్నారు.
వైఎస్ జగన్ ఇటీవలి కాలంలో జిల్లాకు రెండుసార్లు వచ్చారని, జన ప్రభంజనం చూశామని సతీశ్‌రెడ్డి అన్నారు. జగన్ వస్తే భారీ సంఖ్యలో జనాలు వస్తారని, ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చిస్తారనే భయంతో చంద్రబాబు ప్రభుత్వం హెలికాప్టర్ అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా.. అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్య కిరణాలను ఆపలేమన్న రీతిలో వైఎస్ జగన్ పర్యటనలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాదిరి తాను కూడా పేద కుటుంబం నుంచి వచ్చానని చంద్రబాబు చెబుతుంటారని, ఎవరితో పోల్చుకోవాలనే విషయంలో కనీస ఇంగిత జ్ఞానం, సిగ్గు ఉండాలని వైఎస్సార్‌సీపీ హిందూపురం పార్లమెంటు పరిశీలకుడు రమేశ్‌రెడ్డి అన్నారు. ‘గాంధీజీ వారసులు ఎవరో మనకు పెద్దగా తెలియదు.. అంబేడ్కర్ ఆశయాలు తప్ప వారసులు కనిపించరు.. కానీ చంద్రబాబు తన కుమారుడిని రాజకీయంగా తెచ్చి మంత్రిని చేశాడు. మనవడి పేరు మీద రూ.కోట్ల ఆస్తులు ఉన్నాయి’ అని దుయ్య బట్టారు. సూపర్ సిక్స్‌తో సహా వందకు పైగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇంటింటికీ తిరిగి హామీలు.. వంచనల గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని తెలియజేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు మాజీ మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, రాష్ట్ర, జిల్లా పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాబు మోసాలపై ఇంటింటికీ వెళ్లితెలియజేస్తాం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేంపల్లి సతీశ్‌రెడ్డి
పుట్టపర్తిలో ‘బాబు ష్యూరిటీ..
మోసం గ్యారంటీ’కి హాజరు
చంద్రబాబు పాలన స్వలాభం కోసమేనని మాజీ ఎమ్మెల్యే, పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ కార్యకర్తల బాగు కోసమే పథకాలు తెచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేయకుంటే ఉచిత గ్యాస్, తల్లికి వందనం కూడా వచ్చేవి కాదన్నారు. తల్లికి వందనం గురించి అడిగితే.. అమ్మ ఒడి వచ్చిందని చెబుతున్నారని, దీన్నిబట్టి తమ నాయకుడి పథకాలకు పేరు మార్చినా.. ప్రజల్లో చెరగని ముద్ర అలాగే ఉందని అన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరకు ఏమీ తెలీదని, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముందు ఉంటే.. సినిమాల్లో హీరోలకు డూప్‌లా ఆమె వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సూపర్‌సిక్స్ పేరుతో ప్రజలను వంచించిన చంద్రబాబు.. రెడ్‌బుక్‌ను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలు, మద్దతుదారులపై అక్రమ కేసులు, ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. కూటమి పార్టీల నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటామన్నారు. తమ కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో
శరవేగంగా అభివృద్ధి
వైఎస్సార్‌సీపీ హయాంలో పుట్టపర్తిని జిల్లా చేయటంతో పాటు వేల సంఖ్యలో జగనన్న ఇళ్లు కట్టించామని, రెండు జాతీయ రహదారులు, ఒక గ్రీన్‌ఫీల్డు హైవే పనులు చేపట్టామని, రూ.864 కోట్లతో నియోజకవర్గంలో 193 చెరువులు నింపే పనులకు శ్రీకారం చుట్టామని శ్రీధర్‌రెడ్డి గుర్తు చేశారు. వీటన్నింటిని ప్రస్తుత ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పూర్తి చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు.
జనాలొస్తారనే బాధ..
పోల్చుకోవడానికి సిగ్గుండాలి..

చంద్రబాబు.. పెద్ద మోసకారి