పుట్టపర్తి టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఆదివారం కొత్తచెరువులోని శ్రీసత్యసాయి జూనియర్ కళాశాల ఆవరణలో కలెక్టర్, ఎస్పీతో పాటు జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్ కళాశాల పరిసర ప్రాంతాలు పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పుట్టపర్తి సమీపంలోని సత్యసాయి విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల పదో తేదీన సీఎం కొత్తచెరువులోని జిల్లా పరిషత్, జూనియర్ కళాశాల ఆవరణలో జరిగే మోగా పేరెంట్స్ సమావేశంలో పాల్గొంటారు.
పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని అదికారుకు సూచించారు. పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని అధికారును ఆదేశించారు. ప్రతి అధికారీ అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాణరెడ్డి, పుట్టపర్తి, ధర్మవరం ఆర్డీఓలు సువర్ణ, మహేష్, డీఆర్డీఏ పీడీ నరసయ్య, సీపీఓ విజయకుమార్, డీఈఓ క్రిష్టప్ప, పౌరసంబంధాల శాఖ జిల్లా మేనేజర్ రాజు, డీపీఓ సమత, జిల్లా రవాణాధికారి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి
అగళి: తొలి ఏకాదశి సందర్భంగా మధూడి గ్రామంలో భూతప్ప ఉత్సవాలు నిర్వహించారు. భూతప్ప వేషధారుల సంప్రదాయక నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. భూతప్పలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇదిలా ఉండగా జిల్లాలోని వివిధ ఆలయాల్లో ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.
వాహనదారులకు ఝలక్
● లైసెన్స్ లేదని రూ.5వేల జరిమానా
హిందూపురం: నూతన మోటార్ వాహనాల చట్టం అమలుతో వాహనదారులకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఏకంగా రూ.5వేలు జరిమానా విధించారు. ఆదివారం హిందూపురం పట్టణంలోని రహమత్‌పురం సర్కిల్ వద్ద ఆదివారం టూటౌన్ సీఐ అబ్దుల్ కరీం ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. నిబంధనలు పాటించని వారికి, త్రిపుల్ రైడింగ్ చేస్తున్న యువకులను సీఐ కౌన్సెలింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న ఎనిమిది మందికి రూ.5వేలు చొప్పున జరిమానా విధించారు. రూ.వందల్లో వేసే ఫైన్లు ఒక్కసారిగా రూ.వేలల్లో వేయడంతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు.
టీబీ డ్యాంకు నూతన శోభ
బొమ్మనహాళ్: తుంగభద్రమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో డ్యాంకు నూతన శోభ వచ్చింది. ఆదివారం 52,815 క్యూసెక్కులు నదికి, 6 వేల క్యూసెక్కుల నీటిని వివిధ కాలువలకు పంపారు. డ్యాంలో ప్రస్తుతం 77 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచుకుని, మిగిలిన నీటిని నదికి వదిలుతున్నారు. మరో 4 రోజుల్లో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడతో ఆయకట్టు రైతులు వరినారు సాగుతో పాటు మడులను సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రసుత్తం తుంగభద్ర జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,625.21 అడుగులకు నీరు చేరింది. ఇన్‌ఫ్లో 52,805 క్యూసెక్కులు కాగా అవుట్‌ఫ్లో 62,027 క్యూసెక్కులుగా ఉంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 77.180 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1,593.19 అడుగుల వద్ద 13.900 టీఎంసీల నీటి నిల్వంతో, 25,556 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 190 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉండిందని తుంగభద్ర బోర్డు అధికారులు తెలిపారు.

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు