
కోలాహలంగా పెద్దసరిగెత్తు
● ఖాశీంస్వామిని దర్శించుకున్న భక్తులు
బత్తలపల్లి: మండల కేంద్రం బత్తలపల్లిలో బొప్పేపల్లి ఖాశీంస్వామి మొహర్రం ఉత్సవాల్లో కీలక ఘట్టం ఆదివారం పెద్ద సరిగెత్తు కోలాహలంగా సాగింది. హిఽందువులు, ముస్లింలు కలసికట్టుగా పెద్దసరిగెత్తు నిర్వహించారు. ఉదయం నుంచే ముజావర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పీర్లస్వాములకు చక్కెర, పానకాలు చదివించి మొక్కులు తీర్చుకున్నారు. పీర్లను పూలు, వస్త్రాలతో అలంకరించి గుండం చుట్టూ తిప్పారు. రాత్రంతా గుండంలోకి మొద్దులను వేసి రగిలించి అలావు తొక్కారు. వివిధ వేషధారణలతో ఉన్న వ్యక్తులు వరస అయిన వారి వద్దకు వెళ్లి గుండంలోని బూడిదను పూసి ఆనందం వెలిబుచ్చారు. బత్తలపల్లి ఎస్సీ కాలనీ మహిళలు పానకం దుత్తలతో ఊరేగింపుగా వెళ్లడం ఆకట్టుకుంది. గంటాపురం, వేల్పుమడుగు, పోట్లమర్రి, రాఘవంపల్లి, ఈదుల ముష్టూరు గ్రామాల్లో పెద్దసరిగెత్తు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌ఐ సోమశేఖర్ గ్రామపెద్దలకు సూచించారు.
నేడు భేటీ..: బత్తలపల్లిలోని నాలుగు రోడ్ల కూడలిలో సోమవారం ఉదయం 9 గంటలకు వివిధ గ్రామాల పీర్లు భేటీ అవుతాయి. ఈ కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. భేటీని తిలకించేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌ను బైపాస్ మీదుగా మళ్లించేందుకు చర్యలు చేపడుతున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటలలోపు భేటీ ముగించాలని ఆయా గ్రామాల పెద్దలకు పోలీసులు సూచించారు.

కోలాహలంగా పెద్దసరిగెత్తు