
మోసపోతున్నా.. మేలుకోరా?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఆశ ఉండొచ్చుగానీ.. అత్యాశ ఉండకూడదు అంటారు. ఈ అత్యాశే వేల మందిని ముంచేసింది. డబ్బు పోగొట్టుకునేలా చేసింది. రోజుకో యాప్.. రోజుకో సైబర్ మోసం పత్రికల్లో చూస్తూనే ఉన్నా ఎగబడి మరీ కట్టేశారు. చివరకు బిచాణా ఎత్తేస్తే గానీ వాని అసలు విషయం తెలియరాలేదు. వారం రోజుల క్రితం ‘లుక్ యాప్’ గొలుసుకట్టు ఫైనాన్స్ పేరుతో బురిడీ కొట్టించిన కేసులో ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల మంది రూ.30 కోట్లు పైనే పోగొట్టుకున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఉపాధ్యాయులు..ఐటీ ఉద్యోగులూ..
పిల్లలకు జీవిత పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు సైతం ‘లుక్’ ఉచ్చులో ఇరుక్కోవడం విస్మయం కలిగిస్తోంది. రూ.20 వేలు కడితే రోజూ రూ.700 ఇస్తామని అనడంతో రెండు జిల్లాలో సుమారు 800 మందికి పైగా ఉపాధ్యాయులు ‘యాప్’లో డబ్బులు పోశారు. ఇక ఐటీ ఉద్యోగులు వచ్చే జీతాలు సరిపోకనో లేదా అత్యాశకు వెళ్లారో గానీ వేలకు వేలు ఎగబడి కట్టారు. చివరకు మాయగాళ్లు మొత్తం ఊడ్చుకుని నిండా ముంచేశారు. అనంతపురంలోని కమలానగర్‌లో వ్యాపారులు ఒకరికి తెలియకుండా ఒకరు భారీ సంఖ్యలో డబ్బులు కట్టి మోసపోయినట్టు తెలుస్తోంది. లుక్ యాప్ ఎక్కడిదో, యజమాని ఎవరో, కార్యాలయం ఎక్కడో ఎవరికీ తెలియదు. వేలం వెర్రిగా కట్టేశారంతే!
గతంలో మోసాలు జరిగినా...
గతంలో అనంతపురం జిల్లా కేంద్రంగా భారీ స్కాములు జరిగాయి. ఈ–బిడ్ పేరుతో లక్ష రూపాయలు కడితే నెలకు రూ.30 వేలు ఇస్తామని చెప్పగా వేల మంది కట్టారు. నాలుగైదు నెలలు బాగానే ఇచ్చారు. ఆ తర్వాత బోర్డు తిప్పేశారు. రూ.230 కోట్ల మేర బాధితులకు శఠగోపం పెట్టారు. దీంతో కొంతమంది బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత జయలక్ష్మి అనే మహిళ రూ.30 కోట్ల మేరకు చిట్టీల పేరుతో కుచ్చుటోపీ పెట్టింది. తర్వాత కొద్దిరోజులకే ఆదరణ చిట్స్ పేరుతో రూ.50 కోట్లు ఎగ్గొట్టారు. ఇలా పలు ఘటనలు జరిగినా అత్యాశకు పోవడం వల్లే మోసపోతున్నట్టు తెలుస్తోంది.
‘లుక్’ యాప్ బాధితులు 20 వేల మంది పైనే
అత్యాశే కొంప ముంచిన వైనం
బాధితుల్లో ఉపాధ్యాయులు, ఐటీ ఉద్యోగులూ
పోలీసులకు ఫిర్యాదు చేయడానికీ
ముందుకు రాలేక ఇబ్బంది
అనంతపురం నగరంలో ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేస్తున్న పరమేష్.. తన పిల్లలకు స్కూలు ఫీజులకై నా డబ్బులు సంపాదించచ్చనే ఉద్దేశంతో ‘లుక్’ యాప్‌లో రూ.20 వేలు కట్టాడు. కట్టిన నాలుగు రోజులకే కంపెనీ మూసేశారు. దీంతో వారం రోజుల నుంచి బ్యాంకుకు సెలవు పెట్టి ఇంట్లోనే కూర్చున్నాడు. వీరిద్దరే కాదు.. ఉమ్మడి అనంతపురం జిల్లావ్యాప్తంగా ‘లుక్’ బాధితులు వేలల్లోనే ఉన్నారు.
కురుగుంటకు చెందిన సురేష్ రూ.40 వేలు లుక్ యాప్‌లో డిపాజిట్ చేశాడు. నాలుగు రోజులు బాగానే సంపాదించాడు. ఈ క్రమంలోనే మరో 10 మందిని చేర్పించాడు. వారం రోజుల తర్వాత చూస్తే మొత్తం కంపెనీ ఎత్తేశారు. తనతో పాటు తాను కట్టించిన వారి డబ్బంతా పోయింది. దీంతో అవమానంగా భావించిన సురేష్ ఇటీవల ఇంటి నుంచి అసలు బయటకు రావడం లేదు.