
ఏపీ ఈసెట్‌లో బాలికల సత్తా
నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి ఇంజినీరింగ్‌లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్‌లో బాలికలు సత్తా చాటారు. గురువారం విజయవాడలో ఏపీఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. చేజర్లకు చెందిన నాగపూజిత మ్యాథ్స్ విభాగంలో 62 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 10వ ర్యాంకు సాధించింది. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 996 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 761 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ ప్రవేశ పరీక్షలో 718 మంది అర్హత సాధించారు. బాలికల విభాగంలో 94.44 శాతం, బాలరు 92.86 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు 478 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు గురువారం జిల్లా వ్యాప్తంగా 478 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షకు 12,240 మందికి గానూ 11,809 మంది హాజరయ్యారు. 431 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సర పరీక్షకు 1055 మందికి గానూ 1008 మంది హాజరయ్యారు. 47 మంది గైర్హాజరయ్యారు.
ఏపీటీఎస్ ఇన్‌స్పెక్టర్
బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్‌శాఖ ఏపీటీఎస్ (యాంటీ పవర్ తెఫ్ట్ స్క్వాడ్) సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఆంజనేయరెడ్డి గురువారం విద్యుత్ భవన్‌లోని ఆయన చాంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా సర్కిల్ ఎస్‌ఈ విజయన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆంజనేయరెడ్డి ఇప్పటివరకు ఏసీబీ నెల్లూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు.
పలువురు రైతులకు
ఏసీబీ నోటీసులు
పొదలకూరు: మండలంలోని కొందరు రైతులకు ఏసీబీ అధికారులు గురువారం నోటీసులు జారీ చేశారు. 2018లో పొదలకూరు తహసీల్దార్‌గా పనిచేసిన స్వాతి రైతులకు అందజేసిన పట్టాదార్ పాసుపుస్తకాలకు సంబంధించి విచారణలో భాగంగా ఏసీబీ సీఐ రైతులకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. మండలంలోని మొగళ్లూరు, ఆల్తుర్తి, ఆర్‌వైపాళెం తదితర గ్రామాలకు చెందిన రైతులకు ఏసీబీ కార్యాలయం నుంచి వచ్చిన సిబ్బంది వీఆర్వోల ద్వారా నోటీసులు అందజేసినట్టు రైతులు వెల్లడించారు. రైతులు వీలుచూసుకుని ఏసీబీ కార్యాలయానికి హాజరై వారు పొందిన పట్టాలు, పాసుపుస్తకాలకు సంబధించిన వివరాలను వెల్లడించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలిసింది.
సోమశిల క్రస్ట్‌గేట్ల నుంచి లీకవుతున్న నీరు
సోమశిల: సోమశిల జలాశయం క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు లీక యి వృథాగా పో తోంది. ముఖ్యంగా 3, 6, 11 క్రస్ట్‌గేట్లు, ఉత్తర, దక్షిణ కాలువ గేట్ల నుంచి కూడా ఇలా జరుగుతోంది. లీకేజీలను అరికట్టేందుకు ఏటా రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తున్నారు. కాగితాల్లో ఈలెక్కలు కనిపిస్తున్నా వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే పనులు అన్నీ డొల్లేనన్న విషయం అర్థమవుతోంది. ఐఏబీ నిర్ణయం మేరకు రెండవకారుకు నీరు విడుదల చేస్తున్న ఈ సమయంలో జలాశయం అధికారులు నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రెండు నెలల క్రితం రాష్ట్ర జలవనరుల సాంకేతిక సలహాదారుడు కన్నయ్యనాయుడు స్వయంగా జలాశయాన్ని పరిశీలించి క్రష్ట్‌గేట్లు, రోప్‌లు తుప్పు పట్టి దెబ్బతిన్న వాటిని గుర్తించారు. వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని హెచ్చరించారు. అయినా ఆ పనులపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.