
కళ్లకు గంతలు కట్టుకుని కార్మికుల నిరసన
ముత్తుకూరు (పొదలకూరు): మండలంలోని నేలటూరు జెన్‌కో అవుట్ సోర్సింగ్ కార్మికులు నెల రోజులకు పైగా కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ 32 రోజులుగా వివిధ రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నా.. యాజమాన్యం స్పందించకపోవడం సిగ్గు చేటైన విషయమని ధ్వజమెత్తారు. అవుట్ సోర్సింగ్ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా పరిగణించాలన్నారు. ఈ ఆందోళనలో జేఏసీ కన్వీనర్ గోడ భాస్కర్, నాయకులు శేఖర్, ఆదిశేషయ్య, శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు
560 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా బుధవారం 560 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షకు 14,130 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 13,626 మంది హాజరు కాగా, 504 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నుంచి జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షకు 1,461 మందికి 1,405 మంది విద్యార్థులు హాజరయ్యారు. 56 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ టి. వరప్రసాదరావు 17 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
విమానాశ్రయ భూములకు
పరిహారంపై విచారణ
దగదర్తి: దగదర్తి విమానాశ్రయ భూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రైతులకు చెల్లించాల్సిన పరిహారంపై బుధవారం తహసీల్దార్ కృష్ణ అధ్యక్షతన కొత్తపల్లి కౌరుగుంట సచివాలయంలో విచారణ నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు, కుటుంబ వివాదాల కారణంగా కొంత మంది రైతులకు పరిహారం చెల్లించే ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. గత ప్రభుత్వంలో పరిహారం చెల్లించేందుకు చర్యలు చేపట్టినా వివాదాలతో ముందుకు రాలేదు. ప్రస్తుతం విమానాశ్రయ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పెండింగ్‌లో ఉన్న రైతులకు పరిహారం చెల్లించేలా చర్యలు చేపడుతున్నామని తహసీల్దార్ కృష్ణ తెలిపారు. ఎటువంటి వివాదాలు లేని భూములకు పరిహారం చెల్లిస్తామని, రైతులు అందరూ ముందుకు రావాలని కోరారు. కొత్తపల్లి కౌరుగుంట రెవెన్యూ పరిధిలో 65 మంది రైతులకు సంబంధించి సుమారు 89 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. సీజేఎఫ్‌ఎస్ భూము లు, డీకేటీ భూములకు ఎకరాకు రూ.13 లక్షలు, పట్టా భూములకు రూ.26 లక్షల పరిహారం చెల్లిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేకే గుంట సర్పంచ్ అశోక్, వీఆర్‌ఓ బాలనాగమ్మ, ఆర్‌ఐ శివ తదితరులు పాల్గొన్నారు.
నెల్లూరు రూరల్
తహసీల్దార్ సస్పెన్షన్
నెల్లూరు (అర్బన్): నెల్లూరురూరల్ మండల తహసీల్దార్ లాజరస్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ బుధవారం రాత్రి కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాసమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ పదే పదే ఆదేశిస్తున్నారు. ఒక వేళ పరిష్కరించలేకపోతే అందుకు గల కారణాలు స్పష్టంగా వివరించాలని సూచించారు. అయితే భూ సమస్యలు, ఇతర సమస్యలకు సంబంధించి 17 వినతులను పరిష్కరించకుండానే పరిష్కరించినట్టు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. విధుల్లోనూ నిర్లక్ష్యం వహించారు. దీంతో ఈ మేరకు తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.
కృష్ణపట్నం పోర్టులో
కస్టమర్ల సమావేశం
ముత్తుకూరు (పొదలకూరు) : అదానీ కృష్ణపట్నం పోర్టులో బుధవారం కస్టమర్ల సమావేశం నిర్వహించారు. పోర్టు, బీపీసీఎల్ గతి యూనిట్లో లోడింగ్ పెంపొందించేందుకు వివిధ మార్గాలపై చర్చించారు. ఇందుకోసం భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, పోర్టు నిబంధనలను ఉల్లంగించకూడదన్నారు. అనంతరం ఓబులవారిపల్లె–కృష్ణపట్నం రైల్వేలైన్‌ను పరిశీలించారు. ఈ సమావేశంలో సీనియర్ డీసీఎం రాంబాబు వావిలపల్లి, సీనియర్ డీఓఎం డి.నరేంద్రవర్మ, సీనియర్ డీఎస్‌ఓ బి.ప్రశాంత్‌కుమార్, సీనియర్ డీఎంఈ సంజయ్ అంగోతు, పబ్లిక్ రిలేషన్ ఇన్స్‌పెక్టర్ జే దినేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కళ్లకు గంతలు కట్టుకుని కార్మికుల నిరసన