మహిళ కడుపులో నుంచి 9 కిలోల గడ్డ తొలగింపు
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రి (జీజీహెచ్)లో ఒక మహిళకు అరుదైన ఆపరేషన్ చేసి ఆమె కడుపులో నుంచి 9 కిలోల గడ్డను తొలగించారు. ఇందుకు సంబంధించిన వివరాలను గైనకాలజి విభాగాధిపతి డాక్టర్ గీతాలక్ష్మి మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. స్థానిక పద్మావతి సెంటర్‌లో నివాసం ఉండే 46 ఏళ్ల విజయలక్ష్మికి కడుపులో గడ్డపెరుగుతూ వచ్చింది. కడుపు నొప్పిగా భావించి స్థానికంగా ఉండే నొప్పుల మాత్రలు మింగుతూ గడ్డను పెంచుకుంది. నొప్పి ఎక్కువ కావడంతో వారం క్రితం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తాము అన్ని పరీక్షలతో పాటు ఎంఆర్‌ఐ చేశామన్నారు.
కడుపులో గర్భసంచి వద్ద పెద్ద సైజులో గడ్డ ఉండటంతో ఆమెకు విషయం చెప్పామని, ఆలస్యం చేసి ఉంటే కేన్సర్‌గా మారే ప్రమాదం ఉందని తెలియజేశామన్నారు. ఆపరేషన్ చేసి 9 కిలోల గడ్డతో పాటు గర్భసంచిని తొలగించామని, బాధితురాలు కోలుకోవడంతో డిశ్చార్జి చేస్తున్నామని తెలిపారు. పెద్దాస్పత్రిలో ఆధునిక ఆపరేషన్ థియేటర్లతో పాటు అన్ని రకాల పరీక్షలున్నాయని, రూపాయి ఖర్చులేకుండా పెద్ద ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆపరేషన్‌లో భాగస్వామ్యం అయిన అసోసియేట్ ప్రొఫెసర్ డా.సుజాత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హిమబిందు, అనస్థీషియన్ హెచ్‌ఓడీ డాక్టర్ శాంతిశ్రీ, పలువురు నర్సింగ్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
క్వారీ అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ
సంగం: సంగం అరుంధతీయవాడ సమీపంలో కొండ ప్రాంతంలో క్వారీ అనుమతికి స్థానిక సచివాలయంలో మంగళవారం ఆర్డీఓ పావని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ముందుగా అధికారులు క్వారీ అనుమతులకు సంబంధించిన విధివిధానాలను ప్రజలకు వివరించారు. కొంత మంది క్వారీ కావాలని, పనులు దొరుకుతాయని తెలిపారు. మరికొందరు క్వారీ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, ప్రాణనష్టం జరుగుతుందని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరి నుంచి అభిప్రాయాలు సేకరించారు.
ఆర్డీఓ పావని మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. గ్రామానికి ఎటువంటి నష్టం జరగకుండా బాధ్యత తీసుకుంటామన్నారు. అనంతరం ఆర్డీఓ క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు సోమ్లానాయక్, సర్పంచ్ రమణమ్మ, సీఐ వేమారెడ్డి, ఎస్సై రాజేష్, టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

పెద్దాస్పత్రిలో అరుదైన ఆపరేషన్